రేవంత్ పవర్‌ఫుల్ స్పీచ్.. కేసీఆర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్.. కేడర్‌కు స్వీట్ వార్నింగ్
posted on Jul 7, 2021 5:05PM
కరోనా కంటే పీఎం మోదీ, సీఎం కేసీఆర్‌లే ప్రమాదకరం. అందుకే మోదీ, కేసీఆర్‌లను వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లు కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ కేడర్‌లో ఉత్సాహం నింపారు. టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక.. కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు రేవంత్‌రెడ్డి. బోరున వర్షం కురుస్తుండగా.. వానదేవుడు కూడా తమ పార్టీలో చేరారంటూ చమత్కరించారు.
తెలంగాణ తల్లిని మనం ఎవరం చూడలేదు. తెలంగాణ ఇచ్చిన సోనియానే మనకు తెలంగాణ తల్లితో సమానం. ఎంతమంది అడ్డుపడ్డా సోనియా తెలంగాణ ఇచ్చారు. అందుకే, ప్రతీ ఇంట్లో సోనియా పటం ఉండాలన్నారు రేవంత్‌రెడ్డి. ఆ సందర్భంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామాయణంలో సీతను ఎత్తుకెళ్లేందుకు రావణాసురుడు మారీచుడితో కలిసి మాయ లేడి రూపంలో వచ్చి సీతమ్మ తల్లిని అపహరించారు. సీతమ్మను లంకలో దాచిపెట్టినట్టే.. తెలంగాణ ప్రజలు పూజించే తెలంగాణ తల్లిని కేసీఆర్.. తన ఫామ్ హౌసులో దాచి పెట్టుకున్నారని ఆరోపించారు. మారీచుడు, రావణాసురుడు కలిస్తేనే కేసీఆర్ అని విమర్శలు చేశారు. లంకలో ఉన్న సీతను కాపాడేందుకు రాముడికి వానర సేన ఎలా సాయం చేసిందో.. టీఆర్ఎస్‌ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే కార్యకర్తలు వానర సేనలా పని చేయాలని కోరారు. ఇక విజయం మనదే.. తెలంగాణ ద్రోహులు మంత్రులయ్యారని, తెలంగాణ ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కేసీఆర్ వచ్చాక ఎన్‌కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదన్నారు. తెలంగాణకు పట్టిన చీడ కేసీఆర్ కుటుంబమేనని, తెలంగాణను కేసీఆర్ దోచుకుంటున్నారని అన్నారు. మోదీ, కేసీఆర్ వల్ల పేదోడు బతికే పరిస్థితులు లేవన్నారు రేవంత్‌రెడ్డి.
రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో లక్షా 7 వేల ఖాళీలుంటే.. తాజాగా పీఆర్సీ బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో లక్ష 91 వేల ఖాళీలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ నిజంగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఉద్యోగ ఖాళీలు ఎందుకు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చినప్పటికీ ఇంత వరకు ఉద్యమకారుల మీద కేసులు తొలగించలేదని విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలకు పట్టుకున్న గులాబీ చీడను తరిమికొట్టాలని అన్నారు. ఉద్యమకారుడు అని చెప్పుకునే కేసీఆర్.. తెలంగాణను దోచుకుంటున్నారని ప్రశ్నించారు.
ఇక, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్‌కిశోర్‌పైనా రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే.. ప్రశాంత్ కిషోర్‌ని పెట్టుకోవాలని కొందరు సలహా ఇస్తున్నారని, పాదరసంలాంటి కార్యకర్తలే తమకు పీకేలు అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలే పీకేలు.. ఏకే-47 తూటాలు అంటూ కేడర్‌తో ఫుల్ జోష్ తీసుకొచ్చారు రేవంత్‌రెడ్డి.
రేవంత్ ప్రసంగంలో మరో ఆసక్తికరమైన ఘటనా చోటుచేసుకుంది. తాను క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యత ఇవ్వబోతున్నది చాలా స్ట్రాంగ్‌గా తెలియజెప్పారు. అవసరమైతే పార్టీ నుంచి బహిష్కరిస్తానంటూ కేడర్‌కు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తుండగా.. సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు కొందరు అభిమానులు. అలాంటి నినాదాలు వద్దని.. అందరం సమష్టిగా కలిసి పని చేస్తామని... అధిష్ఠానం నిర్ణయాలకు కట్టుబడి ఉంటామంటూ.. ఎవరూ అలాంటి నినాదాలు చేయొద్దంటూ కాస్త గట్టిగానే హెచ్చరించారు. ఈ రోజు నుంచి జై సోనియా, జై రాహుల్ గాంధీ నినాదాలు మాత్రమే వినిపించాలని, ఎవరైనా వ్యక్తిగత నినాదాలు ఇస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.