తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
posted on Dec 9, 2023 6:29AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాలనలో వేగం చూపుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాల అమలుకు శ్రీకారం చుడుతున్నారు. తొలిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నెరవేర్చారు. రాష్ట్రంలో మహిళలు శనివారం (డిసెంబర్ 9) నుంచి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకం అమలులోకి వచ్చింది.
ఈ పథకం కింద తెలంగాణలో శనివారం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతోంది. మహాలక్ష్మి స్కీమ్ ను అమలు ప్రారంభిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ స్కీమ్ ప్రకారం పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, ఆర్డనరీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.
తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణమే. తెలంగాణ దాటి బయటకు వెళ్లాలనుకునేవారు మాత్రం బోర్డర్ వరకూ ఉచితంగా ప్రయాణించి, బోర్డర్ దాటిన తరువాత నుంచి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సూపర్ లగ్జరీ బస్సులను ఉచిత కేటగరిలో చేర్చకపోవడంతో డబ్బులు కట్టి వెళ్లాలనుకునే వారు ఆ బస్సుల్లో ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులు మామూలుగా తక్కువగా ఉంటాయి. అవి కిక్కిరిసిపోయే అవకాశం ఉంటుందన్న భావనతో వాటి సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.