ఇంద్ర‌కీలాద్రిపై కేసులు.. తిరుప‌తిలో ఆంక్ష‌లు..

ఆధ్యాత్మిక క్షేత్ర‌మైన విజ‌య‌వాడ‌ ఇంద్రకీలాద్రిపై కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా క‌రోనా సోకిన వారి సంఖ్య 52కు చేరింది. సోమవారం ఇద్దరు అర్చకులకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రెండు రోజుల క్రితం కొవిడ్‌తో అర్చకుడు మృతి చెందగా.. మరొక అర్చకుని పరిస్ధితి విషమంగా మారింది. కొవిడ్‌తో జమలమ్మ అనే అటెండర్ మృతి చెందింది. జమలమ్మ మృతితో ఇంద్రకీలాద్రి పై మృతుల సంఖ్య మూడుకు పెరిగింది. 

కొవిడ్ కేసుల కార‌ణంగా ఇంద్రకీలాద్రిపై కఠిన ఆంక్షలు విధించారు. దర్శన వేళలను అధికారులు కుదించారు. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు దుర్గమ్మ దర్శనం లభించనుంది. అమ్మవారికి నిర్వహించే అన్ని సేవలతో పాటు పంచహారతులను ఏకాంతంగా నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. కొవిడ్ కేసుల తీవ్రతతో ఉద్యోగులు, అర్చకుల్లో మరింత భయాందోళనలు పెరుగుతున్నాయి. ఆలయంలో విధులు నిర్వహించాలంటేనే అర్చకులు, ఉద్యోగులు వణికిపోతున్నారు. 

మ‌రోవైపు.. క‌రోనా ఆధ్యాత్మిక న‌గ‌రాల‌పై పంజా విసురుతోంది. తిరుప‌తిలో భారీగా కేసులు న‌మోద‌వుతున్నాయి. క‌రోనా విజృంభణ కార‌ణంగా తిరుప‌తిని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించారు. న‌గ‌రంలో ఆంక్షలు విధించారు. మంగ‌ళ‌వారం నుంచి మధ్యాహ్నం 2ల‌కే తిరుప‌తిలో షాపులు మూసి వేయ‌నున్నారు. అటు, తిరుపతి తాతాయగుంట గంగమ్మ జాతర ఏకాంతంగా నిర్వహించాలని ఆలయ బోర్డు సభ్యులు నిర్ణయించారు. అలాగే ఏ ఆలయంలోనూ తీర్థప్రసాదాలు ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేశారు. 

తిరుపతి నగరాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీషా ప్రకటించారు. తిరుపతిలోని ప్రతి డివిజన్‌లో కరోనా కేసులున్నాయని.. వైరస్‌ కట్టడికి ప్రజలే బాధ్యత తీసుకోవాలని సూచించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో వ్యాపార సంఘాలు, ఆటో, జీపు డ్రైవర్ల యూనియన్లతో ఎమ్మెల్యే  భూమన కరుణాకర్‌రెడ్డి, నగరపాలక కమిషనర్‌ గిరీషా, ఎస్పీ వెంకటప్పలనాయుడు సమావేశమయ్యారు. కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు స్వీయ నియంత్రణ తీసుకోవడంతో పాటు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టాలనేదానిపై సుదీర్ఘంగా చర్చించారు.  

మంగ‌ళ‌వారం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరిచేలా తాము నిర్ణయం తీసుకున్నట్లు వ్యాపార సంఘాలు అధికారులకు తెలిపాయి. వైరస్‌ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి నగరాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా నగరపాలక కమిషనర్‌ ప్రకటించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu