రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం
posted on Mar 8, 2025 10:25AM

వివేకాహత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన రంగన్న అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. వైఎస్ వివేకా ఇంటి వాచ్ మన్ రంగన్నది సహజ మరణం కాదంటూ ఆయన భార్య అనుమానం వ్యక్తం చేశారు. ఇదే అనుమానాన్ని పులివెందుల తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి కూడా వ్యక్తం చేశారు. అంతే కాకుండా వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షులు వరుసగా అనుమానాస్పద స్థితిలో మరణించడంపై లోతైన దర్యాప్తు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు రంగన్న మృతదేహానికి రీ పోస్టు మార్టం నిర్వహించారు. తిరుపతి, మంగళగిరి ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఈ రీపోస్టుమార్టం నిర్వహణలో పాల్టొన్నారు. రంగన్న శరీరంపై గాయాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
ఇలా ఉండగా వైఎస్ వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతి విషయంలో అనుమానాలున్నాయంటూ స్వయంగా చంద్రబాబు కేబినెట్ సమావేశంలో పేర్కొన్నారు. అంతే కాకుండా గతంలో పరిటాల హత్య కేసులో కూడా సాక్షులు ఇదే విధంగా అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయాన్ని గుర్తు చేశారు.
అలాగే రంగన్న అనుమానాస్పద స్థితిలో మరణించడంపై స్పందించిన రాష్ట్ర హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంపై క్యాబినెట్ లో చర్చించినట్లు వెల్లడించారు. సమగ్ర దర్యాప్తుకు ఆదేశించామనీ, వివేకా హత్య కేసులో సాక్షుల మరణాలు మిస్టరీగా మిగిలిపోవని చెప్పారు. తలకిందులుగా తపస్సు చేసినా... తప్పు చేసిన వారు తప్పించుకోలేరనీ, చట్ట ప్రకారం శిక్ష తప్పదని అనిత స్పష్టం చేశారు. రంగన్న మృతదేహానికి రీపోస్టు మార్టం నిర్వహించిన అనంతరం అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.