ఇక డిజిటల్ ఇండియాకి 'జియో'స్తు!

డిజిటల్ ఇండియా... ఒకప్పుడు ఇండియా అంటే వెస్టనర్స్ కి పాములు ఆడించుకునే దేశం అనే భావం వుండేది. కాని, ఇప్పుడు ఇండియా పూర్తిగా మారిపోయింది. పాముల్ని పూజించుకుంటూనే... అత్యాధునిక దశలోకి సరసరా పాకేస్తోంది! అది చంద్రమండలమైనా సరే తన మేధస్సుతో అంతు చూస్తోంది! అందుకే, ప్రధాని మోదీ సంధించిన డిజిటల్ ఇండియా బాణం అత్యంత వేగంగా దూసుకుపోతోంది... 


మోదీ డిజిటల్ ఇండియాను నిజం చేసే దిశగా మరో అడుగు పడింది. అయితే, ఈసారి సక్సెస్ ఏ ఇస్రో లాంటి ప్రభుత్వ రంగ సంస్థ నుంచో రాలేదు. రెలయన్స్ లాంటి ప్రైవేట్ ప్లేయర్ కారణంగా డిజిటిల్ ఇండియా కల మరింత సుస్పష్టంగా సాకారమవ్వనుంది!  


రెలయన్స్ వారి జియో త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అయితే, దీన్ని మోదీ కలలుగంటోన్న డిజిటిల్ ఇండియా నినాదానికి లింక్ చేయటం కొంచెం అతిగా అనిపించవచ్చు. నిజానికి ముఖేష్ అంబానీ జియో ద్వారా బిజినెస్సే చేస్తాడు తప్ప దేశ సేవేం కాదు. అది ఒప్పుకున్నప్పటికీ .... జియో కారణంగా మొత్తం ఇండియన్ టెలికామ్ ఇండస్ట్ట్రీ ముఖచిత్రమే మారిపోనుంది. అది ఈ పరిణామంలోని ప్రత్యేకత!


దేశంలోకి సెల్ ఫోన్లు వచ్చిన కొత్తలో కూడా సామాన్యులు బెంబేలెత్తిపోయేలా వుండేవి మొబైల్ రేట్స్. అలాగే, కనెక్షన్ కూడా విపరీతమైన ఖరీదుతో కూడుకుని వుండేది. ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ అన్నిటికి తెగ బాదుడు వుండేది. కాని, అటువంటి దశలో రెలయన్స్ ఎంటరైంది. కేవలం 500లకు మొబైల్ ఇస్తామంటూ మొత్తం గేమంతా మార్చేసింది. ఫలితంగానే ఇప్పుడు మనం చూస్తున్నంత వరకూ టెలికామ్ ఇండస్ట్రీ వచ్చింది. మారుమూల పల్లెళ్లలో కూడా ఇవాళ్ల స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. రెలయన్స్ మన దేశంలో మొబైల్ విప్లవానికి కారణం కాకపోవచ్చు! కాని, అదొక క్యాటలిస్ట్ లాగా ఉపయోగపడిందన్నది మాత్రం నిజం... 


ఫోన్ తో కాల్స్ చేసుకోవటం ఇప్పుడు సమస్య కాదు. సమస్యల్లా స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుని ఇంటర్నెట్ వాడకుండా వుండటం. చాలా మందికి డేటా రేట్స్ పట్ల ఇంతకాలం అసంతృప్తి వుంటూ వస్తోంది. దాదాపు అందరు సర్వీస్ ప్రొవైడర్స్ అటు ఇటుగా ఒకే రేట్ మెయింటైన్ చేస్తున్నారు. పైకి తగ్గించినట్లు ఆఫర్లు , ప్రకటనలు చూపించినా చివరాఖరుకు కస్టమర్ కు దక్కే లాభం అంతంతమాత్రమే. ఈ కారణంతోనే ఇప్పటికీ చాలా మంది తమ స్వార్ట్ ఫోన్ వాట్సప్ వినియోగానికి తప్ప దేనీకి వాడటం లేదు... 


జియో 4జీ వినియోగదారుడికి తప్పకుండా మేలు చేస్తుంది. ఒకటి రెలయన్స్ సంస్థ భారీగా ఆఫర్లు ప్రకటించి ఒక ఎంబీ కేవలం 5పైసలకి ఇవ్వటమే కాదు.... ఇతర సంస్థలు కూడా పోటీలో వుండటం కోసం ధరలు తగ్గించేలా చేస్తోంది. దీని వల్ల అన్ని నెట్ వర్క్ ల వాళ్లు మేలు పొందుతారు. అంతే కాదు, ఎప్పుడైతే డేటా రేట్స్ పడిపోతాయో జనం ఇంటర్నెట్ వాడకం పెంచేస్తారు. వాట్సప్, ఫేస్బుక్ లాంటివి వాడుకోవటం కాకుండా రకరకాల ఇతర వెబ్ సైట్స్ కూడా బ్రౌజ్ చేయగలరు. విద్యార్థులు మొదలు సీనియర్ సిటీజన్స్ వరకూ అందరూ జియో రాకతో లాభపడతారు. తమ చేతి వేళ్ల అంచుల్లో ప్రపంచాన్ని ఒడిసి పట్టుకోగలుగుతారు! మోదీ ఆశిస్తోన్న డిజిటల్ ఇండియా ఇదే! అన్ని రంగాల్లో, అందరూ డిజిటల్ టెక్నాలజీని వాడుకుని మరింత వేగంగా, సమర్థంగా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి! 


వ్యాపార దృష్టితోనే అయినా జియో... ఇండియన్ డిజిటల్ డ్రీమ్స్ కి ఎంతో కొంత సాయపడనుంది. అలాగే, కస్టమర్ కి కూడా చీప్ డేటా రేట్స్ అందుబాటులోకి వస్తాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం!