ఆందోళన'రేపు'తున్న అంకెలు!

ఢిల్లీలోని మన్మోహన్ ప్రభుత్వం కూలిపోవటం, తరువాత మోదీ రావటం, అలాగే, అరవింద్ కేజ్రీవాల్ గద్దెనెక్కటం... ఇవన్నిటికంటే ముందు ఏం జరిగింది గుర్తుందా? ఢిల్లీని పట్టి కుదిపేసిన ఈ మధ్య కాలపు ఉద్యమాల్లో నిర్భయ ఉద్యమం ఒకటి! అసలు నిర్భయ రేప్ తరువాత దేశ రాజధాని పెనంపైన ఆమ్లేట్ లా ఊడికిపోయింది! మన్మోహన్, సోనియా మొదలు షీలా దీక్షత్ వరకూ అందరూ గడగడలాడిపోయారు. జనం రోడ్ల మీదకి వచ్చి రాత్రి, పగలు అన్న తేడా లేకుండా నిరసనలు తెలిపారు! ఆ చారిత్రక ఘట్టానికి ప్రతిఫలమే నిర్భయ చట్టం!. నిర్భయ చట్టం తెచ్చిన మన్మోహన్ ప్రభుత్వాన్ని , ఢి్ల్లీలోని షీలా దీక్షత్ సర్కార్ ని జనం 2014లో అస్సలు క్షమించలేదు. అందుకు అనేక కారణాలు వుండొచ్చు. కాని, స్త్రీలకు రక్షణ ఇవ్వలేకపోవటం కూడా వాటిలో ప్రధానమైంది! అయితే, మన్మోహన్ పోయి మోదీ వచ్చినా, షీలా దీక్షత్ పోయి కేజ్రీవాల్ వచ్చినా నిర్భయల పరిస్థితి ఏమైనా మారిందా? అస్సలు మారలేదు! నిర్భయ చట్టం వున్నా కూడా నిర్భయలంతా భయం భయంగానే బతకాల్సి వస్తోంది!


తాజాగా వెల్లడైన అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికీ దేశ రాజధాని ఢిల్లీయే రేపుల్లో టాప్! 2199కేసులతో సిటీలన్నిట్లో అదే అగ్రస్థానంలో వుంది. ఇక రాష్ట్రాల వారిగా చూస్తే మధ్యప్రదేశ్ 4391 కేసులతో మహిళలకి నరకప్రాయంగా వుంది! ఈ అంకెలు చూసి మధ్య ప్రదేశ్ , ఢిల్లీలు మాత్రమే డేంజర్ అనుకుంటే పొరపాటే! మహారాష్ట్రలో 4144, రాజస్థాన్ లో 3025 కేసులు... ఇలా వుంది లిస్ట్! అంటే... మహిళల భద్రత విషయంలో ఏ రాష్ట్రమూ పెద్ద సంతోషకరంగా ఏం లేదన్నమాట! 


మొత్తం దేశం విషయానికి వస్తే 34600 కేసులు నమోదు అయ్యాయట! ఇవన్నీ స్త్రీల మీద జరిగిన రకరకాల దాడుల కారణంగా నమోదైనవే! అందులో మరీ దారుణం ఏంటంటే.... 33098 కేసుల్లో ఆడవార్ని వంచించింది వారికి తెలిసిన వారు, దగ్గరి వారేనట! ఇక్కడే అసలు సమస్యంతా వుంది! నిర్భయ కేసులో లాగా ఎవరో ఆగంతకులు దాడి చేస్తే అర్థం చేసుకోవచ్చు! కాని, ఇండియాలో చాలా రేపు కేసులు దగ్గరి వారి వల్లే అవుతుంటాయి. అందుకే, చాలా లైంగిక వేధింపు కేసులు పోలీస్ స్టేషన్ దాకా వెళ్లవు! ఢిల్లీలో, మధ్యప్రదేశ్ లో ఎక్కువగా నమోదు అయ్యాయి అంటే ఒక విధంగా దాన్ని మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవాలి కూడా! అక్కడ రేప్ జరిగిన తరువాత కేసు పెట్టేంత చైతన్యం మహిళల్లో వుందని గ్రహించాలి. మిగతా చోట్ల అంతకంటే ఎక్కువ కేసులే జరుగుతున్నప్పటికీ స్త్రీలు దైర్యం చేసే పరిస్థితులు లేకపోవచ్చు!


దేశంలో అభివృద్ధి తారస్థాయిలో వున్న ఢిల్లీలోనూ , అత్యంత వెనుకబాటుతనం వున్న మారుమూల పల్లెళ్లలోనూ....  మహిళల పట్ల, అమ్మాయిల పట్ల అణిచివేత ఒకేలా వుందంటే మనం ఖచ్చితంగా ఆందోళనపడాల్సి వుంది! ఎందుకంటే, కేవలం ఆర్దిక స్వేచ్ఛ, చదువు లాంటివి కూడా ఆడవారికి భద్రత కల్పించలేకపోతున్నాయి. మొత్తంగా భారతీయుల ఆలోచన శైలిలో మార్పు రావాలి. మన సినిమాలు, రచనలు, టీవీ సీరియల్స్... ఇలా అన్నీ సరైన రీతిలో సంస్కరింపబడాలి.దానితో పాటే అత్యాచార కేసులు , మహిళలకు సంబంధించిన ఇతర కేసుల్లో కఠినమైన శిక్షలు త్వరితగతిన పడాలి అప్పుడే దేశంలో సగభాగమైన స్త్రీలకు రక్షణ వుండేది! లేదంటే... మనం మాట్లాడుకుంటోన్న అభివృద్ధి అంతా మేడిపండు ఛందంగానే వుంటుంది!