ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం.. ఆరుగురు మంత్రులు కూడా
posted on Feb 20, 2025 8:40AM

ఢిల్లీలో కొత్త ప్రభుత్వం బుధవారంకొలువుదీరనుంది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీలో పాతికేళ్లు దాటిన తరువాత తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఢిల్లీ సీఎం అభ్యర్థిపై భారీ కసరత్తు చేసిన కమలం పార్టీ అధిష్ఠానం ఎట్టకేలకు రేఖా గుప్తాను ఆ పదవికి ఎంపిక చేసింది. దీంతో ఆమె గురువారం (ఫిబ్రవరి 20) ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో పాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.
రేఖా గుప్తా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఇదే తొలిసారి. తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఆమెకు ముఖ్యమంత్రి పీఠం దక్కింది.
అంతకు ముందు ఎన్నికలలో బీజేపీ విజయం సాధించిన క్షణం నుంచీ ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందన్నదానిపై చర్చోపచర్చలు నడిచాయి. సీఎం పదవి రేసులో పలువురు సీనియర్ నాయకుల పేర్లు వినిపించినప్పటికీ.. బీజేపీ అధిష్ఠానం మాత్రం తొలి సారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తా వైపే మొగ్గు చూపింది. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో రేఖాగుప్తా శాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విజయం సాధించారు.
తీవ్ర కసరత్తు తరువాత బీజేపీ పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, ఓపీ దన్ ఖడ్ సమక్షంలో బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై రేఖా గుప్తాను నేతగా ఎన్నుకున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం రేఖా గుప్తా బుధవారం (ఫిబ్రవరి 19) ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఆ తరువాత ప్రభఉత్వ ఏర్పాటుకు రేఖా గుప్తాకు ఆహ్వానం పలుకుతూ లెఫ్టినెంట్ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.