సింహాచలంలో ప్రమాదానికి కారణాలివేనా ?
posted on Apr 30, 2025 5:18PM
.webp)
సిబ్బందు నిర్లక్ష్యానికి తోడైన ఈదురు గాలులు
అప్పటికప్పుడు నిర్మించిన గోడకు మేకులు కొట్టి పెండాల్స్ తాళ్లు కట్టిన సిబ్బంది
గాలి ఒత్తిడికి పెండా ల్స్ తో పాటు గోడ కూలినట్టు అనుమానం
కర్ణుడి చావుకు కారణాలు ఎన్నో అన్నట్టు సింహాచలంలో గోడకూలి ఏడుగురు భక్తుల మరణానికీ అన్నే కారణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇంజనీరింగ్ సిబ్బంది నిర్లక్ష్యం కాగా, వారి నిర్లక్ష్యానికి రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షం తోడైనట్లు కనిపిస్తున్నది.
ఏటా అక్షయ తృతీయ రోజు మాత్రమే నిజ రూపంలో అప్పన్న స్వామి దర్శనం ఇస్తారు. దీంతో అప్పన్న స్వామి నిజరూప దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు రావడం కద్దు. అయితే గతంలో ఈ ఉత్సవం విశాఖ, ఉత్తరాంధ్ర, ఒడిస్సా ప్రాంత భక్తులకు మాత్రమే పరిమితం అయ్యేది. కానీ దశాబ్ద కాలంగా ఇది ఒక విఐపి ఉత్సవంగా మారింది. గతంలో కేవలం సాధారణ భక్తులు మాత్రమే దర్శనానికి రావడంతో సులభంగా ఎలాంటి అవాంతరాలూ లేకుండా ఈ కార్యక్రమం సజావుగా సాగిపోయేది. అయితే గత దశాబ్ద కాలంగా ఇది వీఐపీల ఉత్సవంగా మారడంతో ప్రోటోకాల్ కోసం అధికారులు, దర్శనాల కోసం ప్రజాప్రతినిధులు ఒత్తిడి పెరిగిపోవడంతో పరిస్థితి మారిపోయింది. సాధారణ భక్తుల కంటే వీఐపీలు, స్వామీజీలు, న్యాయమూర్తులు ప్రజాప్రతినిధుల దర్శనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈసారి కూడా అదే ప్రక్రియ జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే అది కూడా ప్రమాదంలో భక్తుల మరణానికి దారి తీసింది. అదేలాగంటే..
సాధారణంగా సింహాచలం దర్శనానికి సాధారణ భక్తులు బస్టాండ్ నుంచి క్యూ లైన్ లోకి వెళ్తారు. వీఐపీలు ప్రోటోకాల్ అవకాశం ఉన్న భక్తులు రాజగోపురం నుంచి వెళ్తారు. అయితే చందనోత్సవం సందర్భంగా 300 రూపాయల టికెట్ క్యూ లైన్ కోసం బస్టాండ్ నుంచి ఏర్పాట్లు చేశారు. అక్కడ క్యూ లైన్ ను విభజించడానికి తాత్కాలికంగా ఫ్లైయాష్ తోగోడ నిర్మాణం జరిగింది. అక్కడ నుంచి కొంత దూరంలో ఎప్పుడూ ఉండే బారికేట్లు ఉన్నాయి. వాటి వరకు క్యూ కొనసాగేలా పునాదులు అవసరం లేకుండా గోడ నిర్మాణం జరిగింది. అదే సమయంలో గోడకి అవతలి వైపు చలువ పందిర్లతో బాటు పెండాల్స్ వేశారు. ఆ పెండాల్స్ గట్టిగా ఉండడానికి తాళ్లను దూరంగా భూమిలో ఐరన్ కొయ్య పెట్టి తాళ్లు కట్టాలి. కానీ స్యామియానా పెండాల్స్ సిబ్బంది తాత్కాలికంగా కట్టిన గోడకు మేకులతో తాళ్లు కట్టినట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి ఉరుములు మెరుపులు , ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దాదాపు రెండు గంటల పాటు వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఈ భారీ వర్షానికి పెండాల్స్ ఈదురు గాలికి ఊడి పడడంతో తాత్కాలిక గోడ కూడా ఒరిగిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దీన్నిబట్టి తాత్కాలిక నిర్మాణం అయినప్పటికీ నాణ్యత పరంగా ఏ మాత్రం జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకోకపోవడం, షామియానా సిబ్బంది అలక్ష్యం తోడై గోడ కుప్పకూలి ఏడుగురు ప్రాణాలు బలి తీసుకున్నట్టు తెలుస్తోంది దీనిపై ఇప్పటికే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇది ఏ ప్రభుత్వ శాఖపైనా పడకుండా ఎవరికి వాళ్లు తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.