కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. త్వరలో జన, కులగణన
posted on Apr 30, 2025 4:58PM
.webp)
కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దేశ జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. సామాజిక వర్గాల వారీగా లెక్కలు చేపట్టాలని కాంగ్రెస్ సహ పలు విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ జనాభా లెక్కలు 2021 లోనే చేపట్టాల్సి ఉండగా.. కరోనా సంక్షోభం వలన వాయిదా వేశారు.
అలాగే సిల్చార్-షిల్లాంగ్ కారిడార్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 166.8కి.మీ మేర రూ.22,864 కోట్లతో కారిడార్ నిర్మాణం చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. అలాగే చెరుకు పంటకు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.355 ఎఫ్‌ఆర్‌పీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అసోం-మేఘాలయ మధ్య కొత్త హైవే నిర్మాణానికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం దిశగా ఇది ఒక పెద్ద ముందడుగు అవుతుంది. కులాల వారీగా ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులోకి వస్తే, ప్రభుత్వాలు ఆయా వర్గాల అవసరాలకు అనుగుణంగా పథకాలు రూపొందించడానికి వీలవుతుంది. అయితే, ఈ కులగణన ప్రక్రియ ఎలా సాగుతుంది, ఎంత సమయం పడుతుంది, దీనికి సంబంధించిన విధివిధానాలు ఏమిటి అనే విషయాలపై మోదీ సర్కార్ నుంచి ఎలాంటీ క్లారిటీ రాలేదు.