వైసీపీ బెంగళూరు భజన.. కారణమేంటంటే?

అధికారంలో ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయడం అన్నది తెలుగుదేశం తీరు అయితే.. వైసీపీ విధానం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నది. విద్వేష, విధ్వంస, కక్ష పూరిత విధానాలే తమ బలమని వైసీపీ గట్టిగా నమ్ముతున్నట్లు కనిపిస్తోంది.  అందుకు ఇటీవలి కాలంలో వైసీపీయులు చేస్తున్న బెంగళూరు భజనను ఉదాహరణగా చూపుతున్నారు పరిశీలకులు. ఇంతకీ వైసీపీ బెంగళూరు భజన ఎందుకు, ఎలా మొదలైందంటే..  బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సీఈవో కర్నాటక రాజధాని నగరంలో  మౌలిక సదుపాయాలు అత్యంత దారుణమని విమర్శిస్తూ.. ఇలాంటి నగరంలో తమ సంస్థను కొనసాగించడం ఇష్టం లేదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఓ విమర్శ చేశారు.   బెంగళూరులో రవాణా కష్టాలు, మౌలిక సదుపాయాల కొరతకు తోడు..  రహదా రుల అధ్వాన పరిస్థితిపై ఆ పోస్టుతో జాతీయ స్థాయిలో చర్చకు తెరలేచింది.   బెళ్లందూరు ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్న బ్లాక్‌బక్ అరే కంపెనీ సీఈఓ రాజేష్ యాబాజి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పోస్టు బెంగళూరులో రహదారుల అధ్వాన స్థితికి అద్దం పట్టింది.  

తమ కంపెనీ సిబ్బంది కార్యాలయానికి వచ్చి వెళ్లడానికి పట్టే కనీస ప్రయాణ సమయం గంటన్నరకు మించి ఉంటోందనీ, దీనికి తోడు నగరంలో పారిశుద్ధ్యం అధ్వానమనీ ఆయనా పోస్టులో పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదనీ, ఈ పరిస్థితి సమీప భవిష్యత్ లో మెరుగుపడుతుందన్న ఆశ లేదనీ ఆ పోస్టులో పేర్కొన్న సీఈవో ఈ పరిస్థితుల్లో తమ సంస్థను బెంగళూరులో కొనసాగించడం తనకు ఇసుమంతైనా ఇష్టం లేదని పేర్కొన్నారు. 

సరిగ్గా ఇక్కడే నారా లోకేష్ రాష్ట్ర ప్రగతి, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ విషయంలో తనకున్న శ్రద్ధను, చిత్త శుద్ధినీ చాటుకున్నారు.  బ్లాక్‌బక్ అరే కంపెనీ సీఈఓ రాజేష్ యాబాజి  బెంగళూరులో రవాణా కష్టాలు ప్రస్తావిస్తూ.. కంపెనీని అక్కడ నుంచి తరలించాలని భావిస్తున్నట్లు పోస్టు పెట్టిన గంటల వ్యవధిలో లండన్ పర్యటనలో ఉన్న లోకేష్ స్పందించారు. విశాఖపట్నంను హైలైట్ చేస్తూ.. బెంగళూరు నుంచి మీ సంస్థను తరలించాలని భావిస్తే.. విశాఖకు రావాలని కోరుతూ ఆయనను కోరారు.  విశాఖ లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, అద్దాల్లాంటి రహదారులు ఉన్నాయనీ, శాంతి భద్రతల విషయంలో విశాఖ నంబర్ వన్ అని పేర్కొన్నారు. 
దీంతో వైసీపీయులు ఒక్కసారిగా బెంగళూరు భజన ప్రారంభించేశారు. బెంగళూరు నుంచి పరిశ్రమను తరలించాలని లోకేష్ కోరడం ఇరు  రాష్ట్రాల మధ్యా సత్సంబంధాలను దెబ్బతీయడమేనంటూ విమర్శలు గుప్పించడం ఆరంభించారు. అయినా ఒక రాష్ట్రంలోని కంపెనీని ఏపీకి తరలించాలంటూ ఎలా ఆహ్వానిస్తారంటూ మండిపడుతున్నారు. లోకేష్ చర్యలు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే చర్యగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. అయితే పరిశీలకులు మాత్రం మంత్రి నారాలోకేష్ స్పందన రాష్ట్ర ప్రయోజనాలు, ప్రగతి పట్ల ఉన్న చిత్తశుద్ధికి, శ్రద్ధకు తార్కానంగా విశ్లేషిస్తున్నారు. బెంగళూరు నుంచి తమ కంపెనీని తరలించాలని భావిస్తున్నట్లు సదరు కంపెనీ సీఈవో  పేర్కొన్న తరువాతే లోకేష్.. ఏపీ బెస్ట్ చాయిస్ అంటూ ఆహ్వానించారనీ, అందులో తప్పేమిటనీ అంటున్నారు. అయితే ఏపీ అభివృద్ధి పట్ల ఇసుమంతైనా అక్కర లేని వైసీపీ మాత్రం బెంగళూరు నుంచి పరిశ్రమను లోకేష్ ఏపీకి ఆహ్వానించడం ద్వారా రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ గుండెలు బాదేసుకోవడం వెనుక తెలుగుదేశం ప్రభుత్వ ప్రతిష్ట,  లోకేష్ ప్రతిష్ఠ పెరుగుతాయన్న దుగ్ధ తప్ప మరో కారణం లేదంటున్నారు 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu