హద్దులు దాటుతున్న రాం గోపాల్ వర్మ వ్యాఖ్యలు

 

దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

 

ఇటీవల ఆయన వ్రాసిన “గన్స్ అండ్ థైస్” అనే పుస్తకంలో అసాంఘీక శక్తులతో తనకున్న పరిచయాల గురించి, సినీ పరిశ్రమకు చెందినా కొందరితో తన అక్రమ సంబంధాల గురించి వ్రాసినట్లు చెప్పుకొన్నారు. తన పుస్తకాన్ని మాఫియా గ్యాంగులకి, తనతో అక్రమ సంబంధాలు పెట్టుకొన్న మహిళలకి, ఒక ప్రముఖ నీలి చిత్రాల హీరోయిన్ కి అంకితం ఇస్తున్నట్లు చెప్పుకోవడం ఆయనకే చెల్లు. ఇక ఆ పుస్తకంలో ప్రముఖ నటి శ్రీదేవి గురించి కూడా చాలా అభ్యంతరకరమయిన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని ఆయన నిన్న తన ట్వీటర్ మేసేజులో కూడా దృవీకరించడం విశేషం. ఒక పరాయి వ్యక్తి భార్య గురించి అతను ఈవిధంగా అనగలడని సమాజంలో ఎవరూ ఊహించలేరు.

 

ఆయన తాజా మెసేజ్ లలో నటి శ్రీదేవి గురించి ఏమి అన్నారంటే “ శ్రీదేవి వీరాభిమాని అయిన నేను ఆమె భర్త బోనీ కపూర్ కంటే ఆమెను ఎక్కువగా గౌరవిస్తున్నాను. ఆ సంగతి శ్రీదేవికి కూడా తెలుసు. బోణీ కపూర్ నా ఈ వ్యాఖ్యలు చూసి నామీద వెంటనే విరుచుకుపడిపోకుండా శ్రీదేవి తొడల (తండరింగ్ థైస్) గురించి నేను నా “గన్స్ అండ్ థైస్” అనే పుస్తకంలో వ్రాసినదంతా చదవాలని కోరుతున్నాను. శ్రీదేవికి సినీ పరిశ్రమలో ఇంత ఎత్తుకు ఎదగ గలిగారంటే కేవలం ఆమె అద్భుతమయిన నటన మాత్రమె కారణం కాదు. ఆమె అద్భుతమయిన తొడలు కూడా అందుకు కారణమని నమ్ముతున్నాను. ఆమె హిందీలో ‘హిమ్మత్ వాలా’ సినిమాలో నటించినపుడే ఈ విషయం స్పష్టమయింది. ఒకవేళ కేవలం ఆమె ప్రతిభ వలననే ఆమె ఇంత ఎత్తుకు ఎదగ గలిగారనుకొంటే, స్మితా పాటిల్ కూడా ఆమె లాగే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి ఉండాలి. కానీ అలా జరుగలేదు. అందుకు కారణం శ్రీదేవి తొడలే! ఆమె తొడలే ఆమెను స్మితా పాటిల్ కంటే గొప్ప హీరోయిన్ న్ని చేశాయని నేను భావిస్తున్నాను. నేను శ్రీదేవిగారి తొడలను, ఆమె చిరునవ్వును, ఆమె నటనా ప్రతిభని, ఆమె సున్నితత్వాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని చాలా గౌరవిస్తున్నాను.అన్నిటి కంటే ఎక్కువగా ఆమె తన భర్త బోణీ కపూర్ పట్ల చూపుతున్న ప్రేమను ఇంకా గౌరవిస్తున్నాను.” అని వ్రాసారు.