త్రిషా... నువ్వు సూపరు...

 

త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూనే వుంటుంది. ఇటీవల చెన్నైని వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. సదరు వరదల్లో అందరూ మనుషుల క్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. త్రిష మాత్రం వరదల తర్వాత ప్రాణాలతో బయటపడిన కుక్కపిల్లలను ఆదుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. మూగ జీవాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని, వరదల నుంచి బయటపడిన వీధికుక్క పిల్లలను దత్తత తీసుకుని వాటికి జీవితాన్ని అందించాలని త్రిష ట్విట్టర్ ద్వారా పిలుపు ఇచ్చింది. వీధి కుక్క పిల్లలను దత్తత తీసుకోవాలని అనుకున్నవారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ కూడా ఇచ్చింది. తాను దత్తత తీసుకున్న కుక్కపిల్లతో ఫొటోకి పోజు ఇచ్చి, ఆ ఫొటోని పోస్టు చేసింది. అలాగే దత్తత తీసుకోవడానికి సిద్ధంగా వున్న బుజ్జిబుజ్జి కుక్కపిల్లల ఫొటోలను కూడా పోస్టు చేసింది. ఇప్పుడు చెప్పండి.. త్రిష నిజంగానే సూపరు కదూ!