రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్ అధిష్టానానికి ఇజ్జత్ కి సవాల్

 

కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో ప్రస్తుతం ఉన్నబలం ప్రకారం వచ్చేనెల 7న జరగనున్నరాజ్యసభ ఎన్నికలలో నలుగురు అభ్యర్ధులను అవలీలగా గెలిపించుకోగలదు. కానీ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమ అభ్యర్ధులను బరిలో నిలబెట్టాలనే ఆలోచన చేస్తుండటంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఈ ఎన్నికలు ‘ఇజ్జత్ కి సవాల్’గా మారనున్నాయి. ఇటీవల షో-కాజ్ నోటీసు అందుకొన్న జేసీ.దివాకర్ రెడ్డి బరిలో దిగి తన తడాఖ చూపిస్తానని ప్రకటించగా, మొదటి నుండి రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నవారిలో ఒకరయిన గంటా శ్రీనివాసరావు కూడా బరిలోకి దిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

 

అధిష్టానానికి విధేయులయిన సీమాంధ్ర కాంగ్రెస్ శాసనసభ్యులని తీసివేయగా, మిగిలిన వారి మద్దతుతో ఇద్దరు సభ్యులను గెలిపించుకోవడం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాబోదు. ఈ తిరుగుబాటు సభ్యులు కనీసం ఒక్కరిని గెలిపించుకొన్నా అది అధిష్టానానికి చెంపదెబ్బ అవుతుంది. అందువల్లనే ఈ రోజు పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని డిల్లీకి పిలిపించుకొని మాట్లాడ బోతున్నారు. అయితే కొత్తపార్టీ పెట్టే ఊపులో ఉన్నకిరణ్ కుమార్ రెడ్డి, తన బలం నిరూపించుకోవడానికి వచ్చిన ఈ సువర్ణావకాశాన్నిఎట్టి పరిస్థితులలో వదులుకోకపోవచ్చును. గనుక అధిష్టానానికి, బొత్సకు కూడా ఈ ఎన్నికలు కత్తిమీద సాము వంటివేనని చెప్పవచ్చును.

 

కానీ, కేవలం రెండే రెండు రాజ్యసభ సీట్లకోసం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కొందరు కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి తిప్పలు పడుతుంటే, జేసీ దివాకర్ రెడ్డి వంటి వారు ప్రతిపక్షాల మద్దతు కోసం వోల్వో బస్సుల వంటి భారీ బహుమతులను పంచిపెట్టేందుకు కూడా సిద్దపడటం గమనిస్తే, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కోట్లు ఖర్చు చేసి శాసనసభకో, లోక్ సభకోపోటీ చేసి భంగపడటం కంటే, నలబై మంది శాసనసభ్యుల మద్దతు కూడ గట్టుకొని ఈవిధంగా రాజ్యసభకు వెళ్ళిపోవడమే మేలని వారు భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. అందువల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న రెండు సీట్ల కోసం చాల మంది యధాశక్తిన పైరవీలు చేసుకొంటున్నారు.

 

ఈ ఎన్నికలలో ముఖ్యమంత్రి అనుచరులు అందరూ కలిసి, ప్రతిపక్షాల మద్దతు తీసుకోనయినా సరే తమ ఇద్దరు అభ్యర్ధులను గెలిపించుకొనే ప్రయత్నం చేయవచ్చును. అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తన ఇద్దరు అభ్యర్ధులను ఏవిధంగా గెలిపించుకొంటుందో, తనకు వ్యతిరేఖంగా అభ్యర్ధులను నిలబెట్టి మద్దతు ఇస్తున్నసీమాంధ్ర సభ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకొనే సాహసం చేస్తుందో లేదో మరొక వారం రోజుల్లో తేలిపోతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu