లోక్ సత్తాకి గెలిచే సత్తా ఉందా?
posted on Jan 24, 2014 9:13PM
.jpg)
గత ఎన్నికలతో రాజకీయ ఆరంగ్రేటం చేసిన లోక్ సత్తా పార్టీ రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క సీటు కూకట్ పల్లి నుండి గెలవగలిగింది. 16 సీట్లు గెలిచిన చిరంజీవి తన ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ చేతికి అప్పజెప్పేసి మంత్రి పదవులతో తృప్తి పడ్డారు. కానీ ఒకే ఒక్క సీటు గెలిచిన లోక్ సత్తా ఎలాగో నిలద్రోక్కుకొని నేటికీ తన సత్తా చూపేందుకు ఉవ్విళ్ళూరుతోనే ఉంది. అందుకే అన్ని పార్టీల కంటే ముందుగా ఈరోజు ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ వచ్చే ఎన్నికలలో పోటీ చేసే తన 25 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. తాను మళ్ళీ కూకట్ పల్లి నుండే పోటీ చేస్తానని తెలిపారు. తమ పార్టీ ఇతర పార్టీలతో ఎన్నికల పొత్తులు కూడా పెట్టుకోదని ప్రకటించారు.
ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ, కురుక్షేత్ర యుద్ధానికి తీసిపోని రీతిలో సాగనున్న వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్, తెదేపా, వైకాపాలను తట్టుకొని ఆయన పార్టీ అభ్యర్ధులు గెలవగలరా? అనే ప్రశ్నకు ఆయనే జవాబు చెప్పవలసి ఉంటుంది. గత ఎన్నికల తరువాత నుండి నేటి వరకు ఉన్న సమయాన్నిసద్వినియోగపరచుకొని పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు గట్టిగా చేసినట్లు కనబడలేదు. అంతే కాదు, ప్రజా సమస్యలపై పోరాటంలో కూడా లోక్ సత్తా మిగిలిన పార్టీల కంటే బాగా వెనుకబడిపోయింది. ఈ ఐదేళ్ళ కాలంలో పార్టీని బలోపేతం చేసుకొని, రెండవ శ్రేణి నాయకులను ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు జేపీ ప్రోత్సహించి ఉండి ఉంటే, ఈపాటికి పార్టీలోచాలా మంది బలమయిన నాయకులు తయారయ్యేవారు. కానీ, అలాజరగకపోవడం వలన, పార్టీలో ఆయన తప్ప ప్రజలకు పెద్దగా పరిచయమయిన మొహాలు కనబడటం లేదు.
అదేవిధంగా, రాష్ట్ర విభజన విషయంలో జేపీ ఒకసారి సమైక్యమని, మరొకసారి విభజనే మేలని వాదించడంతో అటు తెలంగాణాలో, ఇటు సీమాంధ్రలో కూడా ప్రజల మన్ననలు పొందలేకపోయారు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమాలు జోరుగా సాగుతున్న తరుణంలో జయప్రకాశ్ నారాయణ చాలా దైర్యంచేసి ప్రజలలోకి వెళ్ళే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. భావసారూప్యత గల ఆమాద్మీపార్టీతో ఆయన ఎన్నికల పొత్తులకు ప్రయత్నించినా అతి విశ్వాసంతో ముందుకు సాగుతున్న ఆమాద్మీ ఆయన ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం.
ఈ నేపధ్యంలో ఆయన వచ్చే ఎన్నికలలో ఒంటరిపోరుకి సిద్దమవుతున్నారు. లోక్ సత్తా ఎన్నికలలో పోటీ చేసినా పెద్ద పార్టీలను, కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీలను తట్టుకొని గెలవడం దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చును.ఈ పార్టీలన్నీకలిసి గత ఎన్నికలలోలాగే ఓట్లను చీల్చి ప్రధాన పార్టీలకు నష్టం కలిగించడం కూడా ఖాయమని చెప్పవచ్చును.