చంద్రబాబుకు ఝలక్ ఇస్తున్న రాజ్యసభ సభ్యులు!
posted on May 28, 2012 2:04PM
తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ సభ్యత్వాలకూ లంకె కుదురుతున్నట్లు లేదు. ఒక్కసారి రాజ్యసభ సభ్యత్వ కాలం ముగిసిందా? ఇక ఆ పార్టీని సభ్యులు వదిలేస్తున్నారు. గత పరిణామాలను పరిశీలిస్తే ఈ విషయం యధార్థమనిపిస్తోంది. తాజాగా రాజ్యసభ మాజీ సభ్యుడు మైసూరారెడ్డి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహబూబ్ నగర జిల్లా నుంచి రాజ్యసభ సభ్యుడైన రుమాండ్ల రామచంద్రయ్య తన సభ్యత్వ పదవీ కాలం ముగిశాక ఇటీవలే టి.ఆర్.ఎస్. పొలిట్ బ్యూరో సభ్యుడిగా చేరారు. సినీనటి జయప్రద కూడా తన సభ్యత్వం ముగిశాక సమాజ్ వాదీ పార్టీలో చేరి ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ పార్లమెంటు సభ్యత్వాన్ని పొందారు. తాజాగా ఆమె బిజెపిలోనూ చేరారు.
1994లో ఎన్టీఆర్ అభిమాన నటుడు మోహన్ బాబుకు కూడా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఆయన కూడా బాబును విభేదించి కాంగ్రెస్ తో సంబంధాలు కొనసాగించారు. ఇటీవల ఆయన బాబు దగ్గరయ్యారనుకుంటే జగన్ తో భేటీతో ఆయనను చంద్రబాబు వదులుకోవాల్సి వచ్చింది. రాష్ట్రమంత్రి సి.రామచంద్రయ్య రాజ్యసభ పదవీకాలం పూర్తికాకుండానే చిరంజీవి ప్రజారాజ్యంలో చేరి ఆ తరువాత కాంగ్రెస్ లో విలీనమై మంత్రి అయ్యారు. అలానే రాజ్యసభ సభ్యురాలు వంగా గీత కూడా పీఆర్పీలో చేరి ఆ తరువాత తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే అయ్యారు. ఇలానే రామమునిరెడ్డి, సోలిపేట రామచంద్రారెడ్డి, యలమంచిలి శివాజీ, చిత్తూరుకు చెందిన దుర్గ, పుట్టపాగ రాధాకృష్ణ, కిమిడి కళావెంకట్రావు పార్టీకి దూరమయ్యారు. ఇటీవల తిరిగి కళావెంకట్రావు టిడిపిలో చేరారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా దేవేందర్ గౌడ్, సుజనా చౌదరి, సిఎం రమేష్, నందమూరి హరికృష్ణ, గుండు సుధారాణి ఉన్నారు. వీరు భవిష్యత్తులో ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!