బాలనేరస్థుల చట్టానికి రాజ్యసభ ఆమోదం

 

బాల నేరస్తుల చట్టాన్ని రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. ఇంతవరకు 18 సం.లలోపు వయసున్న వారినందరినీ బాల నేరస్తులుగా పరిగణించేవారు. ఆ కారణంగానే నిర్భయ కేసులో అత్యంత క్రూరంగా ప్రవర్తించిన బాలనేరస్తుడు కేవలం మూడేళ్ళ నిర్బంధంతో బయటపడగలిగాడు. అందుకే వారి వయోపరిమితిని 16 సం.లకి తగ్గిస్తూ చట్ట సవరణలు చేసారు. కనుక ఇక నుంచి 16 సం.ల వయసున్న బాల నేరస్తుడు అటువంటి నేరాలకు పాల్పడితే అతనిని పెద్ద వారితో సమానంగా పరిగణించి కోర్టులు శిక్షలు వేస్తాయి.

 

ఈ బిల్లును ఆమోదించేముందు దానిపై మరింత లోతుగా అధ్యయనం చేయడానికి స్టాండింగ్ కమిటీకి పంపించాలని సిపిఐ (ఎం), డిఎంకె మరియు ఎన్.సి.పి. కోరాయి కానే వారి సూచనను మిగిలిన పార్టీలు తిరస్కరించి బిల్లును ఆమోదించాయి. ఇంతటితో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందినట్లయింది కనుక దానిని రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తారు. ఆయన దానిపై సంతకం చేయగానే ఈ చట్టం అమలులోకి వస్తుంది.

 

అయితే అంత చిన్న వయసులో తెలిసీ తెలియనితనంతో నేరం చేసి ఉండి ఉంటే అటువంటి బాలనేరస్తుల హక్కులకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టంలో అన్ని జాగ్రత్తలు తీసుకోబడ్డాయి. బాలనేరస్థుల బోర్డులో నిపుణులు, మానసిక వైద్యులు అతనిని మొదట విచారించి, అతను ఉద్దేశ్యపూర్వకంగానే ఆ నేరాన్ని చేశాడా లేక ఒక చిన్న పిల్లాడి మాదిరిగా తెలిసీ తెలియనితనంతో ఆ నేరానికి పాల్పడాడా? అనే విషయం నిర్ధారణ చేసుకొన్నాకనే అతనిని న్యాయస్థానాలకు అప్పగిస్తాయి. అప్పుడు ఒకవేళ న్యాయస్థానాలు అతనికి జైలు శిక్ష విధించినట్లయితే, వెంటనే జైలుకి పంపకుండా బాల నేరస్తుల శిక్షణ, పరివర్తన కేంద్రాలకి పంపిస్తారు. అక్కడే అతనిలో పరివర్తన కలిగించేందుకు ప్రయత్నించి అతనికి 21 ఏళ్ల వయసు వచ్చేక అతనికి శిక్ష విధించిన ఆ కోర్టుకి అప్పగిస్తారు. అప్పుడు కోర్టులు సముచిత నిర్ణయం తీసుకొంటాయి. ఈరోజు ఆమోదించిన ఈ చట్టం ప్రకారం నిర్భయ కేసులో బాలనేరస్తుడిని మళ్ళీ శిక్షించే అవకాశాలు లేకపోయినప్పటికీ, ఇక ముందు ఆ వయసుగల పిల్లలు అటువంటి నేరాలకు పాల్పడకుండా ఈ చట్టం నిలువరించగలదని తను ఆశిస్తున్నట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు.