నేతన్నల వెతలు తీరేనా

 

ఒకప్పుడు సిరిసిల్ల అన్న పేరు చెబితే చాలు ఆత్మహత్యలే గుర్తుకువచ్చేవి. నేసిన బట్టలు అమ్ముడుపోక, వాటి ముడిసరుకు కోసం చేసిన అప్పులు తీరక... అదే బట్టలని ఉరితాడుగా మార్చుకునే బాధాతప్త జీవితాలకు సిరిసిల్ల ప్రతినిధిగా నిలిచేంది. అందుకే తెలంగాణ ఉద్యమంలో సిరిసిల్ల ఆత్మహత్యలు కూడా ఒక కీలక నినాదంగా మారాయి. తెలంగాణ ఏర్పటైన తరువాత తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశించిన నేతన్నల పరిస్థితిలో ఏమంత మార్పు రాలేదు. చేనేత రంగాన్ని ఉద్దేశించి ప్రభుత్వం ఒకటీ అరా సంక్షేమ పథకాలను ప్రకటించినా, అవి వారికి అంతగా ఉపయోగపడటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

 

చేనేత వెతలని రూపుమాపేందుకు స్వయంగా కేటీఆర్ దానికి బ్రాండ్ అంబాసిడర్గా మారారు. తను స్వయంగా చేనేత దుస్తులను ధరిస్తూ, నేత వస్త్రాలు ధరించాల్సిందిగా అధికారులను ప్రోత్సహిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక సర్వశిక్షా అభియాన్ కింద యూనిఫారాల కాంట్రాక్టుని కూడా సిరిసిల్లకు అందించడంతో ఓ మూడు నెలల పాటు అక్కడి కార్మికులందరికీ తగినంత పని ఉంటుందని ఆశిస్తున్నారు. అక్కడి ప్రతి కార్మికుడూ వర్క్షెడ్, మగ్గాలు ఏర్పాటు చేసుకునేందుకు తగిన రుణాలు అందిస్తానని కూడా ప్రకటించారు. సిరిసిల్ల వెతలకు ఇవన్నీ శాశ్వత పరిష్కరాలు కాకపోయినా కూడా చేనేత మీద ప్రభుత్వం దృష్టి సారించిదని సంతోషించదగ్గ విషయాలే!

 

తెలంగాణ ప్రభుత్వ అధికారికి లెక్కల ప్రకారమే రాష్ట్రంలో లక్షమందికి పైగా నేత కార్మికులు ఉన్నారు. వీరందరి పరిస్థితీ కూడా అగమ్యగోచరంగానే ఉంది. ప్రభుత్వం కేవలం సిరిసిల్ల మీదే దృష్టి సారిస్తే సరిపోదనీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నేత కార్మికుల జీవితాలు మెరుగుపడేందుకు సత్వర చర్యలు తీసుకోవాలనీ వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలలో వేలాది మగ్గాలు మూతబడిపోయాయి. వేలాది నేత కుటుంబాలు గుజరాత్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు తరలిపోయాయి. నానాటికీ పెరిగిపోతున్న ముడిసరుకు ధరలతో ఎలాగొలా శ్రమకోర్చి నేసిన బట్టని కొనే నాథుడు లేకపోవడంతో నేతన్నలు దిక్కు తోచకుండిపోతున్నారు.

 

ఈ పరిస్థితి మారాలంటే రాజకీయ నాయకులో, సినిమా యాక్టర్లో నేత వస్త్రాలతో ఫొటోలు దిగితే సరిపోదు. ఏదో ఒక ప్రాంతానికి కొన్ని నెలలపాటు ఉపాధి చూపించీ లాభం లేదు. ప్రభుత్వంలోని విభాగాలన్నీ కూడా తమ యూనిఫాంలను నేతన్నల నుంచే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. ముడి సరుకు కొనుగోలులో తగిన సబ్సిడీని అందించాలి. చేనేత సహకార సంఘాలన్నింటినీ ఒక్క తాటి మీదకు తేవాలి. మగ్గాలను ఏర్పాటు చేసుకునేందుకు, వాటిని నిర్వహించుకునేందుకు రాయితీ ఆధారంగా రుణాలను అందించాలి. మాస్టర్ వీవర్స్ కింద పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు లభించేలా చర్యలు తీసుకోవాలి. నేత కార్మికులకు ఈఎస్ఐ వంటి సదుపాయాలు కల్పించాలి.

 

మరోపక్క సాధారణ ప్రజానీకం కూడా చేనేత వైపుగా మళ్లేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు చేనేత వస్త్రాల పట్ల అభిమానం ఉన్నా కూడా, వాటిని అధిక ధర పెట్టి కొనుగోలు చేయలేని పరిస్థితి. పవర్లూంలో సింథటిక్ వస్త్రంతో రూపొందే ఒక చొక్కా ఖరీదు వంద రూపాయలు ఉంటే, అదే చేనేతలో కొనుగోలు చేయాలంటే మూడు వందలు తక్కువ ఖర్చవదు. ఇక నేత చీరలైతే వేల మీదే ఖరీదు చేస్తున్నాయి. కాబట్టి అటు నేతన్నలు సంతోషంగా తమ ఉత్పత్తిని సాగించేందుకు తగిన అవకాశాలు అందిస్తూనే, ఇటు ప్రజానీకం కూడా చేనేత వైపుగా మళ్లేందుకు తగిన ప్రోత్సాహాన్ని ఇచ్చిన రోజున చేనేత కార్మికుని మొహాన నవ్వు విరుస్తుంది.