మళ్లీ వస్తుందా చిరంజీవి మేనియా...

 

ఇప్పుడంటే మల్టీప్లెక్స్‌లు వచ్చేశాయి. ఆన్‌లైన్ బుకింగ్స్ జరుగుతున్నాయి. కొత్త సినిమాని ఒకేసారి వందలాది ధియేటర్లలో ప్రదర్శించే అలవాటు మొదలైంది. కానీ ఒకప్పుడు చిరంజీవి సినిమా చూడాలంటే పట్నం వెళ్లాలి. అక్కడ మొదటి రోజే చిరంజీవి సినిమాని చూసి రావడం అంటే అదో చిన్నపాటి సాహసం. ఆ తొక్కిసలాటలో లాఠీదెబ్బలు తింటే అదో బహుమానం. ఇంతా చేసి మొదటి రోజు సినిమాకి వెళ్తే ఒక్క డైలాగు కూడా వినిపించనంతగా హాల్లో కోలాహలం. అలా ఉండేది చిరంజీవి మేనియా. ఇప్పటి టీనేజి కుర్రాళ్లకి ఆశ్చర్యంగా కనిపించే ఆ మేనియాలో ఆంధ్రదేశంలో ఆనాటి కుర్రకారంతా మునిగితేలినవారే! ఇప్పుడు ఖైదీ నెం.150తో అలాంటి తోపులాటలు ఉండకపోవచ్చు. కానీ సందడిలో మాత్రం ఏమాత్రం సద్దు కనిపించేట్లు లేదు.

చిరంజీవి ఆఖరి సినిమా శంకర్‌ దాదా జిందాబాద్‌ వచ్చి పదేళ్లు గడిచిపోయింది. 2008లో ప్రజారాజ్యం పెట్టిన తరువాత సినిమాలకు దూరమైపోయారు చిరంజీవి. సినిమా రంగంలో చెలరేగినంత తేలికగా రాజకీయాలలోనూ దూసుకుపోదామనుకున్న మెగాస్టార్‌కి చుక్కలు కనిపించాయి. లౌక్యం లేకపోవడం వల్లనో, తరచూ తప్పటడుగులు వేయడం వల్లనో, అతి విశ్వాసమో... కారణం ఏదైతేనేం 2011కల్లా ప్రజారాజ్యానికి పేకప్‌ చెప్పేసి కాంగ్రెస్‌లో కలిసిపోయారు. 2009 ఎలక్షన్లలో ప్రజారాజ్యం కనుక పోటీ చేసి ఓట్లను చీల్చకపోయి ఉంటే రాష్ట్ర చరిత్ర మరోలా ఉండేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. అటు పార్టీగా ప్రజారాజ్యమూ, ఇటు రాజకీయ నేతగా తాను హిట్‌ కాకపోవడంతో చివరికి రాజ్యసభ సభ్యునిగా సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

రాజకీయాలు తనకి సరిపడవనో, తానే రాజకీయాలకు సరిపడననో మొత్తానికి చిరంజీవి దృష్టి మళ్లీ సినిమా మీద పడింది. ఈ నేపథ్యంలో తన 150 చిత్రపు మైలురాయి కూడా దగ్గరపడటంతో ఆయన పునరాగమనం మీద విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి. దాదాపు మూడేళ్ల నుంచి ఆయన 150 చిత్రం ఎలా ఉండాలి, దానికి కథ ఏంటి, ఎవరు దర్శకత్వం వహించాలి అంటూ ఎవరికి వారే విశ్లేషణలు మొదలుపెట్టేశారు. చివరికి వి.వి.వినాయక్‌ చేతుల మీదుగా రామ్‌చరణ్ నిర్మాణంలో ఖైదీ నెం.150 రూపొందింది.

‘రాననుకున్నారా రాలేననుకున్నారా?’ అంటూ నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి సాగిన ప్రసంగానికి బాగానే మార్కులు పడ్డాయి. దీనికి తోడు ఇప్పటికే విడుదల అయిన పాటలు లక్షల మీద లక్షల వ్యూయర్‌షిప్‌ను సాధించడం, ట్రైలర్‌కి కూడా మంచి స్పందన రావడంతో... ఖైదీ నెం. 150కి ఆరంభ వసూళ్లు అదిరిపోతాయని తేలిపోయింది. ఇక నిజంగానే సినిమాలో దమ్ముంటే మరోసారి చిరంజీవి శకం ఖాయంగా కనిపిస్తోంది. దాసరి అన్నట్లు దాదాపు పదేళ్ల తరువాత ఒక హీరో తిరిగి సినిమాల్లోకి రావడం ఇదే మొదటిసారి కావచ్చు. అన్నీ కలిసి వస్తే మరో పదేళ్ల పాటు చిరంజీవి సినిమాల్లో నటించవచ్చు.

ఖైదీ నెం.150 హిట్‌ అయితే నటనాపరంగా చిరంజీవికి మరో దశ మొదలైనట్లే. కానీ రాజకీయపరంగా ఇది ఎలాంటి ఫలితం చూపించబోతోందన్నది ఆసక్తికరమైన విషయం. తెలుగు రాష్ట్రాలలో అందునా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఏదో అద్భుతం జరిగితే కానీ ఇక్కడ కాంగ్రెస్ మళ్లీ నిలదొక్కుకోవడం అసాధ్యం అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో చిరంజీవి కనుక తన గ్లామర్‌ను మళ్లీ సాధించగలిగితే... అలు కాంగ్రెస్‌కు లాభించడమే కాదు, చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలిపినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ విషయాన్ని ఊహించో ఏమో దాసరి, చిరంజీవి సరసన కనిపించేందుకు.... ఇప్పటివరకూ పరోక్షంగా నానాతిట్లూ తిట్టిన మనిషిని, అదే నోటితో తెగ పొగిడేందుకు ఉత్సాహపడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో మెగా ఈవెంట్‌కి డుమ్మా కొట్టి లేనిపోని వివాదానికి మరోసారి తెరదీశారు. మరి ఖైదీ నెం.150లో ఏం డైలాగులు పేలతాయో, ఎలాంటి కథ వినిపిస్తుందో... వాటికి ప్రేక్షకులు స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే! అది చిరంజీవి సినిమా కెరీర్ మీదా రాజకీయ పురోగతి మీదా ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా జనవరి 11నాటికి తేలిపోనుంది.