వైసీపీలో రోజాకు పొమ్మనలేక పొగ?

మంత్రి రోజా అంటే ఫైర్ బ్రాండ్. నోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే.  జగన్ తొలి క్యాబినెట్ లో రోజాకు స్థానం దక్కకపోవడానికీ, మలి క్యాబినెట్ లో చోటు దొరకడానికీ కూడా ఆమె  డైనమిజమే కారణం అంటారు. అయితే తన చిరకాల వాంఛ నెరవేరిన తరువాత అంటే  మంత్రి పదవి చేపట్టిన తరువాత పార్టీలో ఆమెకు అడుగడుగునా పరాభవాలే ఎదురౌతున్నాయి.

కనీసం ప్రోటోకాల్ ప్రకారం గౌరవం కూడా ఆమెకు దక్కడం లేదు. తాజాగా తిరుపతిలో రాష్ట్రపతి పర్యటనలో రోజాకు పరాభవం ఎదురైంది. రాష్ట్రపతి పర్యటనలో జిల్లా మంత్రి హోదాలో రోజా పాల్గొన్నా ఆమెను పట్టించుకున్న వారెవరూ లేకుండా పోయారు.ట. ఎక్కడా ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. ప్రోటోకాల్ ప్రకారం.. రాష్ట్రపతికి జిల్లా మంత్రి స్వాగతం చెప్పాలి. పెద్దిరెడ్డి కూడా మంత్రే. అయినప్పటికీ ఇద్దరూ స్వాగతం చెప్పే వారిలో ఉండాలి. కానీ రోజాకు చాన్స్ రాలేదు. తర్వాత కార్యక్రమంలో వేదికపై చోటు కూడా దక్కలేదు. మహిళా రాష్ట్రపతి వస్తే మహిళా మంత్రికి స్టేజ్‌పై చోటు దక్కలేదు.  

కనీసం ఎక్కడా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇక రాష్ట్రపతికి వీడ్కోలు పలికే సమయంలోనూ ఆమెకు ఎలాంటి ప్రాధాన్యతా దక్కలేదు. అంటే మంత్రి హోదాలో ఉన్నా కూడా అధికారులు కూడా ఆమెను పూర్తిగా విస్మరించారనే భావించాల్సి వస్తోంది.  మామూలుగా ప్రోటోకాల్.. ఇతర వ్యవహారాలు అన్నీ.. రాష్ట్రపతి సిబ్బంది చూసుకుంటారు..  కానీ రాష్ట్ర అధికారులు ఇచ్చే జాబితా ప్రకారమే రాష్ట్రపతి సిబ్బంది ఆ విషయాలను ఖరారు చేస్తారు. అధికారులు ఆ జాబితాలో రోజాకు స్థానం కల్పించలేదు. దీంతో రాష్ట్రపతి సిబ్బంది ఆమెను పట్టించుకోలేదు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా రోజాకు జరిగిన అవమానంపై ఆమె వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 ప్రభుత్వంలో రోజాకు సరైన గౌరవం లభించడం లేదనీ, మంత్రి అయినప్పటికీ సొంత నియోజ కవర్గంలో కూడా  ఆమె ప్రత్యర్థి వర్గాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నదనీ, రోజాను నిర్లక్ష్యం చేస్తున్నారనీ అంటున్నారు. మంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి.. గౌరవం దక్కకుండా చేస్తున్నారంటున్నారు.  ఈ విషయాలన్నిటినీ రోజా  జగన్ దగ్గర మొర పెట్టుకున్నా.. ఫలితం లేకపోయిందని చెబుతున్నారు. పరిస్థితి చూస్తుంటే రోజాకు పొమ్మనలేక పొగబెడుతున్నారని పరిశీలకులు అంటున్నారు.