రెండు వేల మంచాలతో రాహుల్ గాంధీ సభ...
posted on Sep 6, 2016 1:20PM
.jpg)
యూపీ ఎన్నికలకు పార్టీలన్నీ ఇప్పటికే కసరత్తు చేసేస్తున్నాయి. వచ్చే ఏడాది జరిగే ఈ ఎన్నికల్లో గెలవడానికి నేతలు చాలా వినూత్నంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా తమ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. సీఎం అభ్యర్దిగా షీలా దీక్షిత్ ను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రచారం కూడా వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దాదాపు నెల రోజుల పాటు 223 అసెంబ్లీ నియోజకవర్గాల్లో (ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం నియోజకవర్గాలు 403) రాహుల్ పర్యటించనున్నారు. అంతేగాక, యాత్రలో భాగంగా ప్రతి గ్రామంలోనూ పాదయాత్ర చేసి ఇంటింటికి వెళ్లి రైతులతో ముచ్చటిస్తారు. వారి నుంచి డిమాండ్లు సేకరిస్తారు. ముందు దేవరియా జిల్లా రుద్రాపూర్‌లో రైతులతో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ‘ఖాట్‌సభ’ పేరుతో నిర్వహించే ఈ సభలో రైతులు తీరిగ్గా కూర్చోవడానికి ఏకంగా 2వేల మంచాలను ఏర్పాటుచేశారు. మొత్తానికి రైతులకు కష్టం కలిగించకుండా మంచాలు బాగానే ఏర్పాటు చేశారు కానీ.. రాహుల్ ప్రసంగానికి కునుకువేసే రైతులకు మంచాలు బాగానే పనికొచ్చేలా ఉన్నాయి.