రాహుల్‌గాంధి వెనకబడుతున్నారా!

 

పెద్దనోట్ల రద్దు. ఈ నిర్ణయంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నల్లధనాన్ని తుడిచిపెట్టేందుకు ఇది ఒక అద్భుతమైన చర్య అంటూనే, ప్రభుత్వం మరికాస్త సన్నద్ధంగా ఉండి ఉంటే సామాన్యులకి నోటు కష్టాలు వచ్చేవి కావన్న విమర్శలు వినిపించాయి. తాత్కాలికంగా తిట్టుకున్నా, నోటు కష్టాలు తీరేకొద్దీ ప్రజలు మళ్లీ మోదీ నిర్ణయం వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయంతో దేశ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ప్రధానిగా ఆయన పేరు చిరకాలం నిలిచిపోయినా ఆశ్చర్యపడనవసరం లేదు. కానీ నోట్ల రద్దు సందర్భంగా ఏర్పడిన అసౌకర్యాన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకోవడంలో రాహుల్‌ గాంధి విఫలం అయ్యారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

 

నోట్ల రద్దు విషయంలో రాహుల్‌ ప్రతిస్పందనలన్నీ తూతూమంత్రంగానే సాగాయి. పాత నోట్లని మార్పిడి చేసుకునేందుకు సామాన్యులతో పాటు క్యూలో నిల్చొన్నా, ఆ చర్య ఆశించినంత ప్రచారాన్ని అందించలేదు. పైగా ‘స్కాముల్లో కోట్లు దోచుకున్నవారు ఇప్పుడు బ్యాంక్‌ లైన్లో నిలబడాల్సి వస్తోందంటూ,’ మోదీ చురకలు అంటించారు. నోట్ల రద్దు విషయంలో కేజ్రీవాల్‌, మమతాబెనర్జీ, సీతారాం ఏచూరి వంటి రాజకీయ నేతలు ప్రదర్శించిన దూకుడు సైతం రాహుల్‌ చూపలేకపోయారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ విషయంలో తొందరపడి మోదీని ‘రక్తవ్యాపారి’ అంటూ విమర్శించిన రాహుల్‌, నోట్ల రద్దు విషయంలో ఏం మాట్లాడాలో తెలియక నాలుగైదు ట్విట్టర్‌ పోస్టులు పెట్టి సరిపెట్టుకున్నారు.

 

పెద్దనోట్ల రద్దు విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలంటే ఏమంత కష్టం కాదు. ముందే కొందరికి ఉప్పందిందన్న ఆరోపణలు, 2000 నోటు వృధా అనే విశ్లేషణలతో నోట్ల రద్దు గురించి నిలదీయవచ్చు. కానీ అదేమీ జరగలేదు. దీంతో సామాన్యుడిలో ఎగసిన అసంతృప్తిని తనకు అనుకూంగా మార్చుకునే అవకాశాన్ని చేజార్చుకున్నట్లు అయ్యింది. మరో ఏడాది వరకూ కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించకూడదంటూ రాహుల్‌ తీసుకున్న నిర్ణయం ఇప్పటికే విమర్శల పాలవుతోంది. వచ్చే ఏడాదిలో కీలకమైన ఎన్నికలు ఉండటంతో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు జంకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక నోట్ల రద్దు విషయంలో రాహుల్‌ మెతకదనం చూసి స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులే చొరవ తీసుకుని ఉద్యమాలు చేపట్టవలసి వస్తోంది.

 

పరిణతి చెందిన నాయకుడు తన పార్టీకి భరోసాగా నిలవాలి. అవసరం అయినప్పుడు ప్రభుత్వం మీద విరుచుకుపడాలి. దేశం అంతా ఒక్కతాటి మీద ఉన్నప్పుడు తాను కూడా పాలకపక్షానికి అండగా నిలబడాలి. మరి రాహుల్‌గాంధి వీటిని ఎంతవరకు అనుసరిస్తున్నారో ఆయనకే తెలియాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu