రాహుల్‌కి పగ్గాలు.. పార్టీకి రాహుకాలమా?

 

కాంగ్రెస్ పార్టీ తన 123సం.ల ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులను తట్టుకొని నిలబడగలిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మహాసాగరం. అందులో అసంతృప్తి కెరటాలు ఎంత సహజమో, దేశ వ్యాప్తంగా పుట్టే అనేక చిన్నా చితకా పార్టీలు చివరికి ఆ మహాసాగరంలోనే కలిసిపోవడం కూడా అంతే సహజం. కానీ ఇప్పుడు ఆ మహాసాగరం క్రమంగా కుచించుకుపోయి చిన్న సెలయేరులా తయారయింది. అందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలనే తప్పు పట్టవలసి ఉంటుంది. పార్టీ బ్రతికి ఉంటేనే అందులో ఉండే ఏ వ్యక్తికయినా సమాజంలో ఒక హోదా, గౌరవం దక్కుతుంది. పార్టీ ఎన్నికలలో గెలిస్తేనే పదవులు, అధికారం వంటివన్నీ దక్కుతాయి. కానీ అది మరిచిపోయి పార్టీ కంటే తమ ప్రయోజనాలే ముఖ్యం అని భావిస్తే ఏమవుతుందో తెలుసుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ సజీవ ఉదాహరణగా నిలిచి ఉంది.

 

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకొంది. అది సరిపోదన్నట్లు పార్టీ అధ్యక్షురాలు పుత్రవాత్సల్యంతో కొడుకుని ప్రధానమంత్రిని చేయాలనే ఏకైక లక్ష్యంతోనే పార్టీని నడిపించారు.

 

గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించిన నరేంద్ర మోడీ, తన స్వంత పార్టీలోను, బయటా కూడా అనేక పెను సవాళ్ళను ఎదుర్కొని సమర్దుడయిన నేతగా ప్రజల ముందుకు వచ్చినప్పుడయినా సోనియాగాంధీ మేల్కోలేదు. అపార రాజకీయ అనుభవజ్ఞుడు, పరిపాలనాదక్షుడు, గొప్ప నాయకత్వ లక్షణాలు గల నరేంద్ర మోడీకి ఏ మాత్రం సరితూగలేని రాహుల్ గాంధీని నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళడం రాజకీయ ఆత్మహత్య వంటిదే. కానీ ఆ సంగతి సోనియాగాంధీకి తెలియదా? ఆమెకు తెలియకపోతే పార్టీలో హేమాహేమీలయిన కాంగ్రెస్ నేతలకయినా తెలియదా? అంటే అలా అనుకోలేము.

 

అప్పటి కాంగ్రెస్ పరిస్థితిని నిండు సభలో ద్రౌపదీ వస్త్రాపహరణంతో పోల్చవచ్చును. అందరికీ జరుగుతున్నది ఘోర తప్పిదమని తెలుసు. కానీ ఎవరూ దైర్యంగా నోరువిప్పి చెప్పలేని పరిస్థితి. మహాసాద్వి ద్రౌపదిని శ్రీకృష్ణుడు కాపాడాడు. కానీ కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు ఏ కృష్ణుడు రాలేదు, లేడు కూడా. అందుకే కాంగ్రెస్ చరిత్రలోనే ఈ దుస్థితికి చేరుకొంది.

 

కానీ ఏనాడు ఆత్మవిమర్శ చేసుకొని పార్టీని బ్రతికించుకొనేందుకు ప్రయత్నాలు చేయడం లేదు, పైగా రాహుల్ గాంధీని దెబ్బ తీసేందుకే పార్టీలోపల, బయటా కొంతమంది వ్యక్తులు, పార్టీలు కుట్రలు పన్నుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత అనిల్ శాస్త్రి ఆరోపించారు. అటువంటివారిని పార్టీ ఉపేక్షించరాదని ఆయన సలహా ఇచ్చారు. కానీ ఈ విషయాన్నీ కూడా ఎవరో ఒకరు కనిపెట్టి చెపితే తప్ప గ్రహించలేని పరిస్థితిలో ఉంటే, ఇక రాహుల్ గాంధీ పార్టీని ఏవిధంగా నడిపించగలరు? ఇటువంటి సమస్య దేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీకే కాదు అన్ని రాజకీయపార్టీలకీ ఉన్నాయి. కానీ వాటికి సారధ్యం వహిస్తున్నవారే ఆ సమస్యలను స్వయంగా గుర్తించి, వాటిని ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.

 

కానీ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీపై ఈగ వాలకుండా జాగ్రత్తగా కాపాడుకొంటూ, ఆయన తరపున వారే పోరాడుతుంటారు. యుద్ధంలో సైన్యాధక్షుడు సేనలను ముందు ఉండి నడిపించాలి. కానీ సేనలే సైన్యాద్యక్షుడిని కాపాడుకోవలసి వస్తుంటే...ఇక ఆ యుద్ధం ఏవిధంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. గతపదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో చెలగాటం ఆడుకొంది. రాష్ట్ర విభజన సమయంలో ఆ పార్టీ ఏవిధంగా వ్యవహరించిందో గుర్తుకు తెచ్చుకొంటే అది అర్ధమవుతుంది.

 

కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ పేరు ప్రతిష్టలను దెబ్బతీసి, ఆయన పార్టీ అధ్యక్షపదవి చేప్పట్టలేని పరిస్థితులను కల్పించాలని కొందరు కుట్రలు చేస్తున్నారని గగ్గోలు పెడుతోంది. ఆ పార్టీలో నేతలు ఎవరయినా కుట్రలు చేస్తుంటే దానిని నడిపిస్తున్న ఆ తల్లికొడుకులే స్వయంగా చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకు ఇతరులను నిందించి ప్రయోజనం లేదు. కానీ అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పగ్గాలు చేపడితే, దేశంలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే అన్ని పార్టీలు తప్పకుండా స్వాగతించవచ్చు. ఎందుకంటే బలహీనుడయిన అటువంటి ప్రత్యర్ధి ఉంటే వారికి లాభమే తప్ప నష్టం, ఇబ్బంది ఉండవు. కనుక అటువంటి వ్యక్తి చేతిలో తమ పార్టీని పెట్టాలా వద్దా? అనేది కాంగ్రెస్ నేతలే ఆలోచించుకొంటే మంచిది. ఎందుకంటే పార్టీ బ్రతికి ఉంటేనే వారికీ భవిష్యత్ ఉంటుంది. వ్యక్తి ముఖ్యమా లేక పార్టీ ముఖ్యమా? అనే ప్రశ్నకు వారు నిజాయితీగా సమాధానం చెప్పుకోగలిగితే చాలు. వారి సమాధానంపైనే వారి భవిష్యత్, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.