త్వరలో విశాఖ కేంద్రంగా ఏపీకి కొత్త రైల్వే జోన్ ఏర్పాటు

 

త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రైల్వే జోన్ మంజూరు చేయబోతున్నట్లు కేంద్రప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలియజేసింది. ఆయన ఈ విషయాన్ని ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు.

 

ఇంతవరకు భువనేశ్వర్ కేంద్రంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ క్రింద వాల్తేర్ రైల్వే డివిజన్ ఉండేది. అదేవిధంగా విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ క్రింద ఉండేవి. ఇప్పుడు నాలుగు డివిజన్లతో విశాఖపట్టణం కేంద్రంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రైల్వే జోన్ ఏర్పాటవబోతోంది.

 

ఇంతవరకు ఇవన్నీ దక్షిణ మధ్య మరియు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ల క్రింద ఉన్నందున ఈ డివిజన్లపై వచ్చే భారీ ఆదాయం, వాటి నిర్వహణ అన్నీ కూడా పొరుగు రాష్ట్రాల చేతిలో ఉండేవి. ముఖ్యంగా వాల్తేర్ డివిజన్ వైజాగ్ నౌకాశ్రయానికి చాలా దగ్గరలోనే ఉన్నందున దేశ విదేశాల నుండి వచ్చే ముడిసరుకును దేశంలో ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు, అదేవిధంగా ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్ ఘర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి ఐరన్ ఓర్ వంటి ఖనిజాలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఈ డివిజన్ ద్వారానే సరుకు రవాణా అవుతోంది. కనుక మిగిలిన డివిజన్ల కంటే దీని ఆదాయం చాలా భారీగా ఉంటుంది. అయితే ఇంతవరకు అదంతా ఈస్ట్ కోస్ట్ రైల్వే ఖాతాలోకి వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ ఏర్పడితే ఆ ఆదాయం అంతా రాష్ట్రానికే మిగులుతుంది కనుక రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధి మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 17రైల్వే జోన్లు ఉన్నాయి. విశాఖలో కొత్త జోన్ ఏర్పడితే ఆ సంఖ్య 18కి చేరుతుంది.