రాహుల్ పై అనర్హత వేటు పడింది!

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, కేరళలోని వయనాడ్ లోక్‌సభ సభ్యుడైన రాహుల్‌గాంధీని డిస్‌క్వాలిఫై చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నిర్ణయం తీసుకున్నది. ఈ అనర్హత గురువారం  (మార్చి 23, 2023) నుంచి అమల్లోకి వస్తుందని లోక్ సభ సెక్రటరీ జనరల్   శుక్రవారం (మార్చి 24) ఒక నోటిఫికేషన్‌లో తెలిపారు.   ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించిన నేపథ్యంలో రాహుల్ పై అనర్హత వేటు పడింది.  ఆయన పార్లమెంటు సభ్యుడిగా కొనసాగడానికి అనర్హుడంటూ లోక్ సభ సెక్రటేరియెట్  ప్రకటించింది.

దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుందో అని  2019లో కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై  గుజరాత్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే  దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో సూరత్ కోర్టు గురువారం తీర్పును వెలువరించింది.

ఈ తీర్పులో రాహుల్‌కు రెండేళ్లు జైలుశిక్షతో పాటు రూ.15 వేల అపరాధం కూడా విధించింది. అయితే, ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యంగ పదవుల్లో ఉండటానికి గానీ లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి గానీ వీల్లేదు.  పై కోర్టుకు వెళ్లడానికి కోర్టు 30 రోజుల బెయిలు ఇచ్చినా, ఆయన అనర్హుడే అవుతారని న్యాయ నిపుణులు చెబుతున్నారు.