సింధు మేనియాలో ... ఇప్పుడిక కార్పోరేట్లు!

సింధు... ఇప్పుడు ఈమెకున్న ఫ్యాన్స్ అంతా ఇంతా మంది కాదు! ఏకంగా ఒలంపిక్స్ లోనే మెరిసిపోయి భారతదేశానికి తొలి సిల్వర్ తీసుకొచ్చింది! మరి ఏ రేంజ్లో ఫాలోయింగ్ వుంటుంది? మనం ఈజీగా ఊహించవచ్చు! అంతే కాదు, రజినీకాంత్ నేను నీకు ఫ్యాన్ అని అంటే ... సచిన్ స్వయంగా హైద్రాబాద్ వచ్చి బీఎండబ్ల్యూ ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు! ఇంకేం కావాలి? అఫ్ కోర్స్, ఇదంతా సక్సెస్ వల్ల వచ్చిన క్రేజ్! కాని, అసలు విషయం మొదలయ్యేది ఇప్పుడే! అంటే ప్యూర్ ఎకనమిక్స్ అన్నమాట!


సింధు లాంటి ప్లేయర్స్ నిజంగా ఆట మీద ప్రేమతోనే ఆడతారు. ఛాంపియన్స్ అవుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కాని, వాళ్లు ఒక్కసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించాక ఇక కాసుల వర్షం కురిపిపోతుంది! అప్పుడు దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు! స్వయంగా సదరు ఛాంపియనే నాకు డబ్బులొద్దన్నా తళతళాడే చెక్కులు వచ్చేస్తుంటాయి! ఇప్పుడు మన విజయలక్ష్మీ సింధు... ధనలక్ష్మీ కూడా అవ్వబోతోంది! ఆమె బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. కారణం తెలిసింది కదా... ఒలంపిక్స్ లో ఒకే ఒక్క బంపర్ విజయం! అంతే మార్కెట్ మొత్తం తల కిందులైపోయింది! కొన్నాళ్ల కిందటి దాకా సింధు బ్రాండ్ వాల్యూ 20లక్షలు. ఇప్పుడు ఎంతో తెలుసా? అంచనా వేయండి చూద్దాం... 


సింధు ప్రస్తుత బ్రాండ్ వాల్యూ 2 కోట్లకు పైమాటే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది కూడా ఏం లేదంటున్నారు వారు! ఆమె సక్సెస్ యావత్ దేశానికే గర్వకారణం అయినప్పుడు తనకి కోట్లు గుమ్మరించి తమ ప్రాడక్ట్స్ జనంలోకి తీసుకుపోవాలని సహజంగానే కార్పోరేట్స్ తహతహలాడతారు! అయితే, ఒలంపిక్ మెడల్ విన్నింగ్ బ్యాడ్మింటన్ క్వీన్ సింధు మాత్రం పెద్దగా తొందరపడటం లేదట. ఆచితూచి తాను ఎండార్స్ చేయనున్న బ్రాండ్స్ సెలెక్ట్ చేసుకుంటుందట! అదీ మంచిదే... ఆమె గురువు పుల్లెల గోపిచంద్ ఒకప్పుడు కోకో కోలా బ్రాండ్ ఎండార్స్ చేయమంటే చేయలేదని ఒక కథనం ప్రచారంలో వుంది! అందులో నిజానిజాలు ఎలా వున్నా... సిందు కూడా అందరికీ మంచి చేసే విశ్వసనీయ వస్తువుల్నే ప్రచారం చేస్తే చాలా బావుంటుంది!