పీవీ నరసింహారావు కుమారుడు మృతి...
posted on Dec 13, 2016 11:34AM

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రెండో కుమారుడు పీవీ రాజేశ్వర్‌రావు మృతి చెందారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతో బాధపడుతున్న ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మధుమేహం, రక్తపోటు, గుండె, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న ఆయనకు జనరల్ ఫిజీషియన్ ఎంవీరావు నేతృత్వంలో వైద్యుల బృందం చికిత్స అందిస్తుంది. ఆదివారం డయాలసిస్ సైతం నిర్వహించగా ఫలితం లేకుపోవడంతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఆదర్శ్‌నగర్‌లోని స్వగృహానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం ఆదర్శ్‌నగర్‌లోని ఆయన స్వగృహంలో పార్థివదేహాన్ని ఉంచారు.
కాగా పీవీ రాజేశ్వర్‌రావు 1946 ఆగస్టు 14న కరీంనగర్ జిల్లా వంగర గ్రామంలో జన్మించారు. 1996లో జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శిగాను, భాగ్యనగర్ ఖాదీ సమితి ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు. పీవీ రాజేశ్వర్‌రావుకు భార్య రాధిక, నలుగురు పిల్లలు ఉన్నారు.