పంజాబ్ లో కాంగ్రెస్-ఆప్ మధ్యే పోటీ? కెప్టెన్ పైనే కమలం ఆశలు.. 

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతులెత్తేసినట్టేనా? కాంగ్రెస్, ఆప్ మధ్యే పోటీ జరగనుందా? శిరోమణి అకాలీదళ్ అడ్రసే కనిపించడం లేదా? అంటే పంజాబ్ లో జరుగుతున్న పరిణామాలతో రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. పంజాబ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఆప్ రోజురోజుకు బలపడుతున్నట్లు కనిపిస్తోంది. 

2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకోవడం ద్వారా రాష్ట్రంలో సంపూర్ణ మెజారిటీని సాధించింది. 10 సంవత్సరాల తర్వాత SAD-BJP ప్రభుత్వాన్ని గద్దె దించింది. 117 మంది సభ్యుల పంజాబ్ శాసనసభలో ఆమ్ ఆద్మీ పార్టీ 20 స్థానాలను గెలుచుకుని రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. శిరోమణి అకాలీదళ్‌  15 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది, బీజేపీ 3 సీట్లకే పరిమితమైంది. పంజాబ్ లో ఈసారి కాంగ్రెస్, ఆప్ మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ మరోసారి పవర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా.. ఆ పార్టీ వర్గపోరుపైనా విజయాలు ఆధారపడి ఉన్నాయంటున్నారు. ఇక బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా సింగిల్ డిజిట్ దాటకపోవచ్చని వివిధ సర్వే సంస్థల అంచనాల్లో తేలుతోంది. శిరోమణి అకాలీదళ్ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది.  మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ ఎవరి ఓట్ బ్యాంకు ను చీలుస్తారనేది మరో ఆసక్తి కర ఈక్వేషన్ గా మారుతోంది. 

మిషన్ పంజాబ్  కింద  కేజ్రీవాల్ వచ్చే తమ సీట్లను పెంచుకోవటంతో పాటుగా అధికారం దక్కించుకొనే వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఈ సారి ఆప్ ఇక్కడ మహిళా ఓటర్ల మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. పంజాబ్ లో ఎలాగైనా పాగా వేయాలనే సంకల్పంతో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అక్కడ మహిళా ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం మొదలు పెట్టారు. పంజాబ్‌లో ఆప్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ రాష్ట్రంలోని ప్రతి మహిళ బ్యాంకు ఖాతాలలో రూ.1,000 జమ చేస్తుందని కేజ్రీవాల్ ప్రకటించారు. కేజ్రీవాల్ ఈ నినాదం పంజాబ్ ఓటర్లలో ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. రోజు రోజుకు ఆప్ బలపడుతుందని చెబుతున్నారు. 

పంజాబ్ లో మరోసారి విజయం సాధిస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే వర్గ పోరు ఆ పార్టీకి నష్టం కల్గించవచ్చని అంటున్నారు. పీసీసీ చీఫ్ గా నవజ్యోత్ సింగ్ సిద్ధూను నియమిచడంతో కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా తప్పుకున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరుతారని భావించినా.. కొత్త పార్టీ పెట్టారు. అమరీందర్ సింగ్ వెంట ఎక్కువగా కాంగ్రెస్ నేతలే వెళ్లారు. దాంతో ప్రస్తుత ముఖ్యమంత్రి, సిద్దూ మధ్య సఖ్యత లేదని తెలుస్తోంది. సీఎంతో పడకపోవడం వల్లే పీసీసీ చీఫ్ పదవికి సిద్దూ గతంలో రాజీనామా ప్రకటించారు. హైకమాండ్ బుజ్జగించడంతో మళ్లీ వెనక్కి తగ్గారు. అయినా పార్టీలో కోల్డ్ వార్ కొనసాగుతోందని తెలుస్తోంది. పంజాబ్ లో కాంగ్రెస్ కు మంచి అవకాశాలు ఉన్నా.. ఆ పార్టీలో నెలకొన్న వర్గపోరు కొంప ముంచే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ నేతలంతా కలిసి పనిచేస్తే మాత్రం గెలవవచ్చని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి.

పంజాబ్ లో బీజేపీ పరిస్థితే దారుణంగా కనిపిస్తోంది. పంజాబ్ లో పాగా వేసేందుకు కమలనాధులు ఎన్ని ఎత్తులు వేసిన ఫలించడం లేదంటున్నారు. మోడీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో బీజేపీపై రైతులు తీవ్ర కోపంగా ఉన్నారు. బిల్లులను రీకాల్ చేసుకున్నా కమలంపై కర్షకుల్లో ఆగ్రహం మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. అందుకో పంజాబ్ పై బీజేపీ పెద్దలు ఆశలు వదులుకున్నారని, కొత్త పార్టీ పెట్టిన అమరీందర్ సింగ్ పైనే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. పంజాబ్ లో ఈసారి కెప్టెన్ అమరీందర్ సింగ్  కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతారని సన్నిహితులు చెబుతున్నారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతే కొత్త పార్టీని ఏర్పాటు చేసుకున్న అమరీందర్ సింగ్.. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయనున్నారు. అలాగే శిరోమణి అకాలీదళ్ చీలికవర్గంతో వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఉండే అవకాశముందని ఇప్పటికే ఆయన సంకేతాలిచ్చారు. పొత్తు సాధ్యంకాని పక్షంలో అన్ని స్థానాల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలో నిలుస్తుందని ప్రకటించారు. 

మొత్తంగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతానికి కాంగ్రెస్- ఆప్ మధ్య పోటీ ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమకు ఆశలు లేవని గ్రహించిన బీజేపీ... కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీతో పొత్తు ద్వారా కొన్ని సీట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో పంజాబ్ రాజకీయాలను శాసించిన అకాలీదళ్ మాత్రం ఈసారి రేసులో లేకుండా పోయిందని తెలుస్తోంది.