సీఎం జగన్ నియోజకవర్గంలో ఎస్సైని ఢీ కొట్టి మరీ ఈడ్చుకెళ్ళిన మద్యం అక్రమ రవాణాదారులు..

ఏపీలో మద్యం అక్రమ రవాణాదారుల దురాగతాలు నానాటికి పెరిగిపోతున్నాయి. తాజాగా సాక్షాత్తు సీఎం జగన్ సొంత నియోజకవర్గం అయిన పులివెందులలో అక్రమ మద్యం రవాణా చేస్తున్న ఓ వ్యక్తి బరితెగించాడు. ఏకంగా ఎస్సైనే వాహనంతో ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో ఎస్సైకి తృటిలో తప్పించుకుని.. మరీ నిందితుడిని అరెస్టు చేశారు. కారులో మద్యం అక్రమంగా రవాణా అవుతోందన్న సమాచారంతో ఎస్సై గోపినాథ్ రెడ్డి శుక్రవారం పులివెందులలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక రాఘవేంద్ర థియేటర్ సమీపంలో అటువైపుగా వెళ్తున్న ఓ కారును ఆపేందుకు ఎస్సై ప్రయత్నించారు. అయితే కారును నడుపుతున్న వ్యక్తి ..పోలీసులను చూసి వారిని భయపెట్టేందుకు కారును ముందుకు వేగంగా కదిలించారు.

 

దీంతో అప్రమత్తమైన ఎస్సై జారి కిందపడకుండా కారును గట్టిగా పట్టుకున్నారు. ఎస్సై కారుపై వేలాడుతుండగానే నిందితుడు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం కారును పోనిచ్చాడు . ఈ క్రమంలో ఎస్సై గోపీనాథ్‌రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి కారు అద్దాలను పగలగొట్టారు. ఇంతలో కారును వెంబడించిన పోలీసులు.. వాహనాన్ని అడ్డుకోవడంతో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఆ కారును, అందులోని 80 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రాణాలకు తెగించి నిందితులను పట్టుకున్న ఎస్సైపై ఉన్నతాధికారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే సాక్షాత్తు సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో ఇటువంటి ఘటన జరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu