భూ ఆక్రమణ కేసులో వంశీకి మరో రిమాండ్ !
posted on Mar 19, 2025 10:16AM
.webp)
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పీటీ వారెంట్ పై పోలీసులు విజయవాడ సబ్ జైలు నుండి గన్నవరం కోర్టులో హాజరు పరిచారు. అత్కూరు పోలీసు స్టేషన్ పరిధిలో వంశీపై నమోదైన భూ అక్రమణ కేసులో ఈ పీటీవారెంట్ జారీ అయ్యింది. పటిష్ట బందోబస్తు మధ్య వంశీని పోలీసులు గన్నవరం కోర్టుకు తీసుకు వచ్చారు. అత్కూరు పీఎస్ లో నమోదైన కేసుకు సంబంధించి వచ్చే నెల 1 వరకూ వంశీకి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో వంశీని తిరిగి విజయవాడ సబ్ జైలుకు తరలించారు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైఎస్ హయాంలో అడ్డగోలుగా, ఇష్టానుసారంగా రెచ్చిపోయి చేసిన ఆక్రమణలు, దౌర్జన్యాలకు ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టైన వంశీపై వరుసగా కేసులు నమోదౌతున్నాయి. ఆయా కేసులలో వంశీకి కోర్టు రిమాండ్ విధిస్తోంది.
తాజాగా బెదిరించి భూమిని విక్రయించారనే ఆరోపణలతో వంశీపై ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసులో రిమాండ్ విధిస్తూ గన్నవరం కోర్టు తీర్పును వెల్లడించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులలో కూడా వంశీ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి విదితమే. వంశీకి ఇప్పటికే రెండు రిమాండ్‌లు ఉండగా.. ఇది మూడో రిమాండ్. కాగా వల్లభవనేని వంశీపై పలు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం వాటిపై దర్యాప్తునకు సిట్ వేసిన సంగతి తెలిసిందే. వంశీ అక్రమాలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వంశీపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.