ఈ రాజగోపాల్‌ను ఏం చేయాలి!

ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజికి సంబంధించి ఎట్టకేలకు ప్రభుత్వం నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. మీడియాలో రోజుకో సాక్ష్యం బయటకు వస్తూ ఉండటంతో మొదట గుంభనంగా ఉన్న ప్రభుత్వం, సీఐడీ విచారణకు ఆదేశించింది. విచారణను చేపట్టిన రెండు మూడు రోజులకే దర్యాప్తు అధికారుల కళ్లు చెదిరే వాస్తవాలు బయటపడ్డాయి. ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం బహిర్గతం అయిన మాట వాస్తవమేననీ, ఇందులో 72 మంది విద్యార్థులు లబ్ది పొందారనీ విచారణలో వెల్లడయ్యింది. ఇందుకోసం ఒకో విద్యార్థి నుంచీ 70 లక్షల వరకూ వసూలు చేసినట్లు తేలింది.

 

ప్రశ్నాపత్రం ముందుగానే వెల్లడయ్యిందని తేలిపోయిన నేపథ్యంలో ఎంసెట్‌-2ని ప్రభుత్వం రద్దు చేసే అవకాశం లేకపోలేదు. దీంతో వేలమంది విద్యార్థులు నెలల తరబడి చదివిన చదువులు, ప్రతిభతో సాధించిన ర్యాంకులు వృథా అయిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే నీట్‌ అనీ ఎంసెట్‌-1 అనీ ఎంసెట్‌-2 అనీ విద్యార్థుల మనస్తత్వాల మీద ప్రభుత్వాల రకరకాల ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ సమస్యలకి తోడు ఇప్పుడు లీకేజీ వ్యవహారం కూడా తోడయ్యింది.

 

ఇలాంటి దౌర్భాగ్యపు తతంగాలకు కారణం ఎవరు అన్న ప్రశ్న తలెత్తినప్పుడు మాటిమాటికీ ఒకే పేరు ముందుకు వస్తోంది. అతనే రాజగోపాల్‌ రెడ్డి! 2006 బెంగళూరు మెడికల్ ఎంట్రెన్స్‌ పరీక్ష, 2014 పీజీ మెడికల్‌ ఎంట్రెన్స్‌, యాజమాన్యం కోటాలో ఉండే సీట్ల విక్రయం... ఇలా పరీక్షలు, సీట్ల కేటాయింపులకు సంబంధించి రాజగోపాల్ మీద నాలుగు క్రమినల్‌ కేసులు నడుస్తున్నాయి. పలుకుబడి, బరితెగింపు అన్న రెండే రెండు లక్షణాలతో కుట్రపూరితంగా ప్రశ్నాపత్రాలను సాధించడం రాజగోపాల్ సిద్ధహస్తుడని రుజువయ్యింది. తమ పిల్లవాడికి అర్హత ఉన్నా లేకున్నా వైద్యుడు కావాలన్న తపనతో రాజగోపాల్ వంటి వారికి సలాం కొట్టే తల్లిదండ్రులు ఎలాగూ ఉన్నారని తేలిపోయింది. మరి ఎప్పటిలాగే ఓ సాదాసీదా కేసు పెట్టి రాజగోపాల్ తప్పించుకునేందుకు అవకాశం ఇవ్వాలా! లేకపోతే చివరి వరకూ వదలకుండా, మళ్లీ ఇలాంటి పాపానికి తలపెట్టకుండా అతగాణ్ని కటకటాల వెనుకే ఉంచాలా అన్నది ప్రభుత్వం చేతిలోనే ఉంది. లేదంటే కడుపు మండిన విద్యార్థుల ఆవేశం ఏదో ఒక రోజు కట్టలు తెంచుకునే ప్రమాదం ఉంది.