రక్తసంబంధం అంటే ఇదే...

 

75 సంవత్సరాల క్రితం తనకు దూరమైన అక్కను చెల్లెలు కలుసుకుని ఎంతో సంతోషించింది. భారత ప్రధాని నరేంద్రమోడీ చైనా పర్యటన సందర్భంగా ఈ అపురూపమైన ఘట్టం జరిగింది. చైనా దేశానికి చెందిన మెరైన్ ఇంజినీర్ అన్‌చి పొంగ్ 75 ఏండ్ల క్రితం తన కూతురు అన్ రోసీని (81) బీజింగ్‌లో వదిలిపెట్టి చెన్నైకి వచ్చి స్థిరపడ్డాడు. ఆయన చెన్నైలో మరో వివాహం చేసుకున్నాడు. ఆయనకు అన్ (62) అనే మరో కుమార్తె పుట్టింది. ఇటీవల తన తండ్రి మూలాలను తెలుసుకొనేందుకు ప్రయత్నించిన అన్, బీజింగ్‌లో తన సోదరి ఉన్నట్లు సోషల్‌మీడియా ద్వారా తెలుసుకుని, ఆమెను కలుసుకొనేందుకు సహకరించాలని ప్రధాని మోదీకి తన  కుమారుడి చేత లేఖ రాయించింది. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ అధికారులు చైనా అధికారులకు తెలియజేసి, ఈ అక్కా చెల్లెళ్ళ కలయికకు ఏర్పాట్లు చేశారు. గురువారం నాడు బీజింగ్‌లోని ఓ రెస్టారెంటులో ఈ అక్కాచెల్లెళ్ళు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు. వీరి మనోభావాలను ఒకరికొకరు చెప్పడానికి ఒక దుబాసీ కూడా వీరికి సహకరించాడు.