రాష్ట్రపతి నిర్ణయంపై తెలంగాణా భవితవ్యం

 

రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు తెలంగాణా బిల్లుపై చర్చకు మరో నెలరోజులు కాకపోయినా పదిరోజులు గడువు ఇచ్చేందుకు హోంశాఖ అంగీకరిస్తూ ఆ మేరకు రాష్ట్రపతికి ఒక లేఖ వ్రాసినట్లు సమాచారం. అయితే, రాష్ట్రపతి హోంశాఖ సూచనలకు కట్టుబడి కేవలం పదిరోజుల గడువే ఈయనవసరం లేదు. ఆయన తన విచక్షణాదికారాల మేరకు అవసరమని భావిస్తే రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు నెలరోజులు గడువు కూడా ఈయవచ్చును. ఒకవేళ ఆయన కేంద్రం సూచించినట్లు కేవలం పదిరోజులు మాత్రమె గడువు ఇచ్చినట్లయితే, తెలంగాణా బిల్లుని యూపీయే ప్రభుత్వ చిట్టచివరి పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టేందుకు వీలుంటుంది. అదే నెలరోజులు సమయం ఇచ్చినట్లయితే ఇక బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టడం కుదరదు గనుక వచ్చే ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరగకపోవచ్చును.

 

రాష్ట్ర విభజనతో రాజకీయ లబ్ది పొందాలని భావించిన కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారంలో తలబొప్పి కట్టడంతో ముందుకు వెళ్ళలేక వెనక్కి కూడా వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. గనుక, ఒకవేళ రాష్ట్రపతి తెలంగాణా బిల్లుపై చర్చించడానికి రాష్ట్ర శాసనసభ కు మరో నెల రోజులు గడువు ఇచ్చినట్లయితే ఈ సమస్య నుండి సురక్షితంగా బయటపడగలదు. అలాకాక రాష్ట్రపతి కేవలం పదిరోజులే గడువు ఇచ్చినట్లయితే, ఆ తరువాత పార్లమెంటులో బిల్లుని ఆమోదింపజేయలేక చతికిలపడితే, రాష్ట్రంలో రెండు ప్రాంతాలలో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం ఖాయం. అందువల్ల రాష్ట్రపతి నిర్ణయం కోసం సమైక్యవాదులే కాదు కాంగ్రెస్ కూడా ఆశగా ఎదురుచూస్తోందని భావించవచ్చును. కానీ, రాష్ట్రపతి నెలరోజులు గడువు ఇచ్చినట్లయితే, తెలంగాణాలో మళ్ళీ ఉద్యమాలు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu