ఈటల లెక్కెంత? హుజురాబాద్‌లో ఎవరి బలమెంత?
posted on Jun 9, 2021 10:54AM
ఈటల రాజీనామాతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక వస్తే..? గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి? రాజేందర్ బీజేపీ నుంచి బరిలో దిగితే ఎవరికి లాభం? గత ఎన్నికలో ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇలా హుజురాబాద్ బైపోల్ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే.. ఈటల ఇలాఖాలో రాజకీయ లెక్కలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇన్నాళ్లూ పార్టీని, ఈటలను వేరు చేసి చూడలేని పరిస్థితి. ఇకపై ఆ ఓటు బ్యాంకు ఎటు వైపు మళ్లుతుందో..? ఓటర్లు టీఆర్ఎస్‌ను ఆదరిస్తారా? ఈటల వెంటే నిలబడతారా? ఆయన బీజేపీలో చేరితే.. ఈటలకు బలం పెరుగుతుందా? లేక, ఈటలే బీజేపీకి బలంగా మారుతారా? ఇలా అనేక ఆసక్తికర ప్రశ్నలు.
హుజురాబాద్. అక్కడ బీజేపీ బలం దాదాపు శూన్యం. అదంతా ఈటల ఇలాఖా. ఇప్పటిదాకా టీఆర్ఎస్‌దే గుత్తాధిపత్యం. అయితే, ఈటల బీజేపీలో చేరితే.. టీఆర్ఎస్ బలం బలహీనమై.. కాషాయం మరింత బలోపేతమవడం మాత్రం ఖాయం. హుజురాబాద్‌లో ఓట్ల లెక్కల చిక్కుముడులు విప్పితే పలు సంచలనాలు కనిపిస్తాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్లను పరిశీలిస్తే.. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. హుజురాబాద్‌లో బీజేపీ ఉనికే ప్రశ్నార్థకం. గత ఎన్నికల్లో పువ్వు గుర్తుకు నోటా కంటే తక్కువ ఓట్లు రావడం ఆసక్తికరం. 2018లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ 1,04,840 ఓట్లు కొల్లగొట్టి.. .కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డిపై 43,719 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రఘుకు 1,683 ఓట్లు రాగా.. నోటాకు ఏకంగా 2,867 ఓట్లు రావడం విశేషం. ఇలా, హుజురాబాద్‌లో అసలేమాత్రం బలమేలేని బీజేపీకి.. ఈటల చేరికతో వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు అవుతుంది. గత ఎన్నికల్లో ఈటలకు పడిన లక్ష పైచిలుకు ఓట్లలో.. ఈసారి ఈటలకు ఎన్ని? టీఆర్ఎస్‌కు ఎన్ని? పడతాయనేదే గెలుపుఓటములను డిసైడ్ చేస్తుంది.
ఎలాగైనా ఈటలను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయాలని డిసైడ్ అయ్యారట గులాబీ బాస్. హుజురాబాద్‌లో బలమైన కేండిడేట్‌గా ఉండి.. గత ఎలక్షన్‌లో ఈటలపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కౌశిక్‌రెడ్డిని కారు ఎక్కించుకునేలా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. పార్టీ నేతలు టీఆర్ఎస్‌ను వీడి ఈటల పంచన చేరకుండా చెక్ పెడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు బీజేపీ కౌన్సిలర్స్‌కు గులాబీ కండువ కప్పేశారు. మాజీ టీడీపీ, తాజా బీజేపీ నేత పెద్దిరెడ్డిని లాగేసేందుకు రెడీగా ఉన్నారు. బలమైన బీసీ నేత ఎల్.రమణ కోసమూ గాలం వేశారు. మంత్రులను మోహరించి హుజురాబాద్‌లో ఈటలను ఇరకాటంలో పడేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
ఈటల సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ.. టీఆర్ఎస్‌కు ధీటుగా రాజకీయం నెరపుతున్నారు. టీఆర్ఎస్‌లోనే ఉంటామంటూ ప్రకటించిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ఆ తర్వాత తూచ్ అంటూ ఈటల చెంతన చేరిపోయారు. తాజాగా, పలు గ్రామాలకు చెందిన 12 మంది సర్పంచులూ టీఆర్ఎస్‌ను వీడి ఈటలకు జై కొట్టారు. మరోవైపు.. తానే స్వయంగా బరిలో నిలిచి.. కేసీఆర్‌ని కవ్వించి.. కారుపై కాలు దువ్వే బదులు.. తన తరఫున తన సతీమణి జమునారెడ్డిని పోటీలో నిలిపి.. అధికార పార్టీ దూకుడును డైల్యూట్ చేసేలా ఈటల స్కెచ్ వేస్తున్నట్టు సమాచారం. జమునారెడ్డి బరిలో దిగితే.. రాజకీయాలకు కొత్త కాబట్టి.. ఆమెపై టీఆర్ఎస్ శ్రేణులు డైరెక్ట్‌గా అటాక్ చేయడానికి కాస్త ఇబ్బందిపడతారు. రాజేందర్ మీద చూపించినంత అగ్రెసివ్‌నెస్.. జమునారెడ్డిపై చూపించలేరు. దాన్ని అడ్వాంటేజ్‌గా మార్చుకొని.. హుజురాబాద్‌లో నెగ్గుకురావాలనే ఆలోచన సైతం చేస్తున్నారని అంటున్నారు. అయితే, ఈటల బీజేపీలో చేరితే.. తాను పోటీ చేయాలా? లేక, తన భార్య జమునారెడ్డిని పోటీకి దింపాలా? అనేది పార్టీ నిర్ణయం మేరకే నడుచుకోవాల్సి ఉంటుంది. బీజేపీ నేతలు మాత్రం ఈటల రాజేందర్ బరిలో దిగితేనే.. కేసీఆర్‌కు ధీటుగా ఉంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే.. ఎవరి అంచనాలకు అందని విధంగా ఎత్తుగడలు వేయడంలో కేసీఆర్ దిట్ట. అందుకే, టీఆర్ఎస్ నుంచి గులాబీ బాస్ బరిలో నిలిపే.. కేండిడేట్ ఎవరనేది ఇప్పుడే చెప్పలేం. జాబితాలో అనేక పేర్లు ఉన్నా.. చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చు. అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ ఏమాత్రం తొందరపడటం లేదు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చాకే కారు డ్రైవర్ ఎవరో తేలుతుంది. అందాక కేవలం తెరమీద ఈటలపై దాడి చేసే గులాబీ సైన్యమే కనిపిస్తుంది. అయితే, కేసీఆర్‌ను దాదాపు రెండు దశాబ్దాలుగా దగ్గరుండి మరీ గమనించిన ఈటల రాజేందర్.. తన గులాబీ బాస్ చెడుగుడుకు.. ఎలా విరుగుడు చూపిస్తారో చూడాలి...