జగన్ రెడ్డిపై ఎంపీ రఘురామ మరో బాంబ్! అడ్డంగా బుక్కయినట్లేనా.. 

నర్సాపురం ఎంపీ రఘురామ రాజు.. ఇప్పుడు ఈ పేరు వింటేనే వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదట. ముఖ్యంగా జగన్ శిబిరానికి కొన్ని రోజులుగా కంటి మీద నిద్ర లేదని తెలుస్తోంది. జగన్ రెడ్డి ప్రభుత్వంపై ఢిల్లీలో ర‌ఘురామ ఎదురుదాడి మామూలుగా లేదు. సుప్రీంకోర్టు, పార్ల‌మెంట్‌, ఎన్‌హెచ్ఆర్‌సీ.. ఇలా దేనినీ వ‌దిలిపెట్ట‌డం లేదు. త‌న‌కు జ‌రిగిన దారుణంపై, త‌న‌పై జ‌రిపిన థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగంపై.. ఢిల్లీ స్థాయిలో జ‌గ‌న్‌రెడ్డితో చెడుగుడు ఆడుకుంటున్నాడు ర‌ఘురామ‌. ఇక త‌న అరెస్టులో పాత్ర‌ధారులు, సూత్ర‌ధారులైన ప్ర‌తీ ఒక్క‌రినీ.. పేరు పేరుగా శిక్షిస్తున్నాడు. రాజు గారి దెబ్బ‌కు.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది చాలామందికి .అంతేకాదు ఏపీ సర్కార్ అవినీతిని ఒక్కొక్కటికి బయటికి తీస్తున్నారు ఎంపీ రఘురామ రాజు. చీకటి బాగోతాలను బయటపెడుతున్నారు. ప్రభుత్వ సొమ్మును అమూల్ లాంటి సంస్ఖల మాటున నోక్కేసే ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు రఘురామ.

తాజాగా జగన్ సర్కార్ పై ఎంపీ రఘురామ రాజు మరో బాంబ్ పేల్చారు. జగన్ రెడ్డి సర్కార్ భారీ అవినీతి గుట్టును ఢిల్లీలో బట్టబయలు చేశారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో జరిగిన, జరుగుతున్నఅవినీతిపై కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేశారు ఎంపీ రఘురామ రాజు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేతో పాటు నేతలు.. పోలవరం నిర్వాసితుల పునరావసం ప్యాకేజీలో పాల్పడుతున్న అక్రమాలకు సంబంధించి పక్కా ఆధారాలను ఆయన సేకరించారు. బోగస్ పేర్లతో పునరావాసం ప్యాకేజీని పోలవరం ఎమ్మెల్యే కాజేసినట్లు కనిపెట్టిన రఘురామ.. అందుకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, డబ్బులు డ్రా చేసినట్లుగా ఉన్న ఆధారాలను కూడా కేంద్రానికి అందించారు. ఇద్దరు మహిళల పేరిట దాదాపు 2 కోట్ల రూపాయలను వైసీపీ నేతలు స్వాహా చేసినట్లు ఎంపీ రఘురామ ఆధారాలు సంపాందించారు. 

పోలవరం ముంపు ప్రాంతంలో నిర్వాసితుల పేరుతో పరిహారం సొమ్మును భారీగా అధికార పార్టీ నేతలు దిగమింగుతున్నారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. దీనిపై ఫోకస్ చేసిన నర్సాపురం ఎంపీ రఘురామ... పక్కా ఆధారాలు సేకరించారు.  ముంపు పరిహారం కోసం ఎవరూ తమదని పేర్కొనని (అన్‌ క్లెయిమ్డ్‌) భూములను గుర్తించి, వాటి ద్వారా పక్కాగా కుంభకోణం నడిపించినట్లు గుర్తించారు. ఈ భూములకు పరిహారం ఇవ్వాలంటే కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ ఉండాలని, లేదా కోర్టు ఆదేశాలైనా ఉండాలి.. కానీ, అవేవీ లేకుండానే అధికార పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే, స్థానిక ఉన్నతాధికారులతో కలిసి ఈ వ్యవహారం నడిపించారని రఘురామ కనిపెట్టారు. దీనికి సంబంధించి పక్కా ఆధారాలను కేంద్ర జలశక్తి శాఖకు అందించారు.  

‘మచ్చా మహాలక్ష్మి అనే గిరిజన మహిళకు ముంపు భూమి పరిహారం కింద 1.16 కోట్లు మంజూరైనట్లు గతేడాది జూలై 13న అధికారులు ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. అదే రోజు ఆమె పేరుతో భద్రాచలంలోని హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకులో ఖాతా తెరిచారు. ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బు డిసెంబరులో ఆ ఖాతాలో జమ అయింది. అదే రోజు మడకం సావిత్రి అనే మరో గిరిజన మహిళకు రూ. 99 లక్షలు మంజూరైనట్లు ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. అదే బ్యాంక్‌లో అదే రోజు ఆమె పేరుతో ఖాతా తెరిచారు. ఆ వెంటనే ఆ డబ్బు మరొకరి ఖాతాకు తరలిపోయింది. మచ్చా మహాలక్ష్మి పేరుతో రెవెన్యూ రికార్డుల్లో ఒక ఎకరా ఉంది. కానీ,11 ఎకరాలు ఉన్నట్లుగా రికార్డులు మార్చారు. అలాగే సావిత్రి పేరు మీదకు 9ఎకరాలు మార్చి పరిహారం కొట్టేశారు. ఇందుకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, నగదు డ్రా చేసిన రషీదులన్ని రఘురామ సేకరించారు. వీటన్నింటిని కేంద్రానికి అందించి పోలవరం నిర్వాసికుల ప్యాకేజీలో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. 

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసంలో ఎంపీ రఘురామ బయటపెట్టిన అవినీతి సంచలనంగా మారింది. ఈ రెండే కాదు.. ఇంకా చాలా మంది పేర్లతో డబ్బులను కొట్టేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిర్వాసితులకు ఇస్తున్న పరిహారంలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. మరీ రఘురామ ఫిర్యాదుపై కేంద్ర సర్కార్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu