తెలంగాణ ఇంటర్ పరీక్షలు రద్దు.. మరీ ఏపీలో!
posted on Jun 9, 2021 10:54AM
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలను రద్దు చేసింది. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. ఫస్ట్ ఇయర్‌లో వచ్చిన గ్రేడ్‌ల ప్రకారమే సెకండియర్‌లో గ్రేడింగ్ ఇవ్వనున్నట్టు తెలిపింది.
కరోనా కల్లోలంతో పరీక్షల నిర్వహణ కష్టతరంగా మారింది. రాష్ట్ర స్థాయిలో పదో తరగతి పరీక్షలను, ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను సైతం రద్దు చేస్తున్నట్లు గత ఏప్రిల్ నెలలో ప్రకటించారు. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేసింది. అయితే సెకండ్ ఇయర్ పరీక్షలను వాయిదా వేస్తూ.. జూన్ నెలలో నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అయితే కరోనా తీవ్రక ఇంకా కొనసాగుతుండటం.. కేంద్రం కూడా తన పరిధిలోని సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేసింది. దీంతో తెలంగాణ సర్కార్ కూడా ఇంటర్ సెకండియర్ పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో ఇంటర్ పరీక్ష రద్దు కావడంతో ఏపీ పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. దేశమంతా ఒకలా ఉంటే.. ఏపీలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. పరీక్షలపై పంతానికి పోతోంది జగన్ రెడ్డి సర్కార్. పరీక్షలు నిర్వహించి తీరుతామని చెబుతోంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్. తగ్గించిన సిలబస్‌లతో ఇప్పటికే పరీక్షలకు ప్రశ్నాపత్రాలు కూడా రూపొందించామని చెప్పారు. ఏపీ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. విద్యార్థుల జీవితాలతో చెలగాడుమాడుతున్నారని విపక్షాలతో పాటు పేరెంట్స్ కూడా ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమే పరీక్షలను రద్దు చేసినప్పుడు.. ఏపీ ప్రభుత్వానికి అంత పంతం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.