కులం పోయి మ‌తం వ‌చ్చే.. పోలీసుల ఓవ‌రాక్ష‌న్‌!.. పాద‌యాత్ర‌లో హైటెన్ష‌న్‌..

అమ‌రావ‌తి రైతుల ఉత్సాహం ఏమాత్రం త‌గ్గ‌ట్లే. మ‌హాపాద‌యాత్ర‌లో పాదం ఆగ‌ట్లే. 31 రోజులుగా అదే హోరు..అదే జోరు. ఊరూరా నీరాజ‌నం. గ్రామ‌గ్రామాన అమ‌రావ‌తి నినాదం. రాజ‌ధాని రైతుల‌కు ఏపీ వ్యాప్తంగా ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌టంతో.. పాల‌కుల్లో ప్ర‌కంప‌ణ‌లు. అందుకే, పోలీసుల‌ను పాద‌యాత్ర‌పైకి ఉసిగొల్పుతున్నారు. లేనిపోని కొర్రీలు పెట్టి యాత్ర‌ను అడ్డుకోవాల‌ని చూస్తున్నారు. కానీ, సంక‌ల్పసిద్ధి అధికంగా ఉన్న రైతులు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. పోలీసుల ఆంక్ష‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ధీటుగా ఎదుర్కొంటున్నారు. తాజాగా, నెల్లూరు జిల్లా మ‌రుపూరు ద‌గ్గ‌ర ఖాకీల తీరుతో తీవ్ర ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. పోలీసుల వైఖ‌రిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  

న్యాయ‌స్థానం టూ దేవ‌స్థానం.. దేవ‌స్థానం పేరులో అమ‌రావ‌తి రైతులు పాద‌యాత్ర చేస్తున్నారు. యాత్ర‌లో తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర‌స్వామి ర‌థాన్ని ముందు నిలిపారు. ఆ వెన‌కాలే స‌ర్వ‌మ‌తాల‌కు సంబంధించిన వాహ‌నాలు ఉంటాయి. మ‌హాపాద‌యాత్ర మొద‌లైన‌ప్ప‌టి నుంచీ ఈ ర‌థాలు రైతుల‌తో పాటే ముందుకు సాగుతున్నాయి. 31 రోజుల త‌ర్వాత పోలీసుల‌కు ఈ విష‌యం గుర్తొచ్చిన‌ట్టుంది. పాద‌యాత్ర‌లో స‌ర్వ‌మ‌తాల‌కు చెందిన వాహ‌నాల‌కు అనుమతి లేదంటూ నెల్లూరు జిల్లా ఖాకీలు కిరికిరి పెట్టారు. ఆ వాహ‌నాల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో, నెల్లూరు జిల్లా పొదలకూరు రోడ్డు మరుపూరు ద‌గ్గ‌ర‌ రోడ్డుపై రైతులు, మహిళలు బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు, రైతుల మధ్య తీవ్ర‌ వాగ్వాదం చోటుచేసుకుంది.   

పాదయాత్ర ప్రారంభం నుంచి వస్తున్న వాహనాలకు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన కొనసాగించారు. రైతుల నిరసనతో కిలోమీట‌ర్ల మేర‌ ట్రాఫిక్‌ నిలిచిపోయింది.  యాత్రను ముందుకు సాగనీయకుండా పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు నినాదాలు చేశారు. గ‌తంలో అమ‌రావ‌తి ఉద్య‌మానికి కులాన్ని ఆపాదించార‌ని.. ఇప్పుడు మ‌తంను బూచిగా చూపిస్తూ.. యాత్ర‌ను అడ్డుకోవాల‌ని చూస్తున్నార‌ని మండిప‌డ్డారు. కోర్టు అనుమ‌తులు ఉన్నా.. ఇలా వేధించ‌డం ఏంట‌ని నిల‌దీస్తున్నారు రాజ‌ధాని రైతులు.

అక్క‌డితో ఆగ‌లేదు పోలీసులు. రైతులకు భోజ‌నాలు త‌యారు చేసేందుకు, వారు భోజ‌నాలు చేసేందుకు వేసుకునే శిబిరాల‌కూ అనుమ‌తులు లేవంటూ ఆ ఏర్పాట్ల‌ను అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్ష‌ల‌తో వేళ‌కు భోజ‌నం చేయ‌లేక ప‌లువురు మ‌హిళా రైతులు సొమ్మ‌సిల్లి ప‌డిపోవ‌డం క‌లిచి వేసింది.

బీపీ, షుగ‌ర్ ఉన్న రైతులు పోలీసుల తీరుతో బాగా ఇబ్బందులు ప‌డ్డారు. ఎలాగోలా వేరేచోట భోజ‌నాలు సిద్ధం చేసుకున్నా.. లంచ్ చేసేందుకు షామియానాలు వేసేందుకూ పోలీసులు ఒప్పుకోక‌పోవ‌డంతో.. రోడ్డు ప‌క్క‌నే.. ఎండ‌లో.. దుమ్ముధూళిలో భోజ‌నం చేయాల్సిన దుస్థితి దాపురించింది. అమ‌రావ‌తి కోసం భూములిచ్చిన రైతుల‌మ‌ని.. ఒక‌ప్పుడు ఎంతోమందికి ఆక‌లి తీర్చిన వార‌మ‌ని.. జ‌గ‌న్‌రెడ్డి వ‌ల్ల ఇప్పుడు త‌మ‌కు ఈ దుస్థితి ప‌ట్టింద‌నిన వాపోతున్న‌ రాజ‌ధాని రైతులు ఆవేద‌న‌, ఆక్రంద‌న చూసే వారితో క‌న్నీళ్లు పెట్టిస్తోంది. పాపం.. అమ‌రావ‌తి రైతులు.. జ‌గ‌న్‌రెడ్డి రాజ‌ధాని రాజ‌కీయంతో ఎంత అవ‌స్థ‌లు ప‌డుతున్నారో అనిపిస్తోంది