రంగంలోకి ఆర్మీ.. మోదీ రివ్యూ..

ఇండియ‌న్ ఆర్మీ. స‌రిహ‌ద్దుల్లో చెల‌రేగే సోల్జ‌ర్స్‌. వారికి దేశ భ‌ద్ర‌త ఎంత ముఖ్య‌మో.. దేశంలోని ప్ర‌జ‌ల‌ భ‌ద్రతకూ అంతే ప్రాముఖ్యం ఇస్తారు. అందుకే, ప్ర‌స్తుత క‌రోనా క‌ల్లోల ప‌రిస్థితుల్లో మేముసైత‌మంటూ ప్ర‌జాసేవ‌కు సిద్ధంగా ఉన్నారు. గ‌తంలో తుఫానులు, వ‌ర‌ద‌లు, భూకంపాల స‌మ‌యంలో సైన్యం త‌మ వంతు సాయం చేసింది. ఇప్పుడు వైర‌స్ విప‌త్తులోనూ రోగుల‌ను ఆదుకునేందుకు ముందుకు వ‌స్తోంది. 

కొవిడ్-19 విజృంభణ నేపథ్యంలో ప్రజలకు సేవలందించడానికి సైన్యం సన్నద్ధతను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. ఈ పరిస్థితుల్లో సైన్యం చేపడుతున్న చర్యలను పరిశీలించారు. కొవిడ్ రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో ఆక్సిజన్, పడకల కొరత దేశాన్ని వేధిస్తున్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవనేతో మోదీ సమావేశమయ్యారు. 

కొవిడ్ మేనేజ్‌మెంట్‌లో సైన్యం చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై చర్చించారు. సైన్యంలోని వైద్య సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉంచినట్లు జనరల్ నరవనే తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక ఆసుపత్రులను సైన్యం నిర్మిస్తోందని చెప్పారు. సాధ్యమైన చోట ప్రజల కోసం ఆసుపత్రులను నిర్మించేందుకు సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. సమీపంలోని సైనిక ఆసుపత్రులను సందర్శించి, వైద్య సేవలు పొందాలని ప్రజలను కోరారు. దిగుమతి చేసుకున్న ఆక్సిజ‌న్‌ ట్యాంకర్ల కోసం అవసరమైన సిబ్బందిని పంపించినట్లు తెలిపారు. వాటిని నిర్వహించేందుకు ప్రత్యేక నైపుణ్యం ఉన్న‌ వారిని కేటాయిస్తున్న‌ట్టు ప్ర‌ధాని మోదీతో చెప్పారు ఆర్మీ చీఫ్‌. అవ‌స‌ర‌మైతే ఎలాంటి సేవ‌కైనా సైన్యం అన్ని వేళ‌లా సిద్ధంగా ఉంద‌న్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu