మోదీ మెచ్చిన ర‌ఘురామ‌.. భుజం త‌ట్టిన ప్ర‌ధాని.. బీజేపీలో చేరిన‌ట్టేనా?

న‌ర్సాపురం వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. ఢిల్లీలోనే ఉంటున్నారు. నిత్యం మీడియాతో మాట్లాడుతుంటారు. సీఎం జ‌గ‌న్‌రెడ్డిని, వైసీపీ స‌ర్కారును ఏకిపారేస్తుంటారు. ప్ర‌భుత్వ‌ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు నిల‌దీస్తుంటారు. ప్ర‌తీ విష‌యంలోనూ త‌న సుస్ప‌ష్ట అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తుంటారు. త‌న‌పై కేసులు పెట్టినా.. సీఐడీ అరెస్ట్ చేసినా.. క‌స్ట‌డీలో థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించినా.. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ‌ బెదిరింపుల‌కు అస‌లేమాత్రం అద‌ర‌లేదు..బెద‌ర‌లేదు..దూకుడు త‌గ్గించ‌లేదు. 

ఆ.. ఏదో మాట్లాడుతుంటారు.. ఎవ‌రు ప‌ట్టించుకుంటారులే అనుకోడానికి లేరు. ఏపీలో ర‌ఘురామ‌కు ఫుల్ ఫాలోయింగ్‌. టీవీల్లో ర‌ఘురామ లైవ్ ఎప్పుడు వ‌స్తుందోనని ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు చాలామంది. ఫ‌లానా టాపిక్‌పై ర‌ఘురామ కామెంట్ ఏంట‌ని గూగుల్‌లో సెర్చ్ చేసే వారూ ఉన్నారు. ఇలా ర‌ఘురామ క్రేజ్ ఏపీలోనే కాదు.. ఢిల్లీలోనూ ఫుల్ పాపులారిటీ ఉంది. ఏకంగా ప్ర‌ధానమంత్రి మోదీనే.. ర‌ఘురామ‌ను పేరు పెట్టి ప‌ల‌క‌రించి.. కొన్ని క్ష‌ణాలు ఆయ‌న‌తో మాట్లాడి.. భుజం త‌ట్టి ఎంక‌రేజ్ చేశారంటే మామూలు విష‌య‌మా? ర‌ఘురామ‌నా మ‌జాకా!

పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎంపీ రఘురామకృష్ణరాజును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రఘురామకృష్ణ రాజు  హాజరయ్యారు. ముందు వరసలో కూర్చున్న ఎంపీ రఘురామను ముందుగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పలకించారు. ఆ తరువాత అటుగా వచ్చిన ప్రధాని మోదీ.. రఘురామకృష్ణరాజును పేరు పెట్టి పిలిచి కొంచెం సేపు నిలబడి భుజం తట్టి వెళ్లారు. 

ర‌ఘురామ బీజేపీలో చేరుతారంటూ చాలా రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా మోదీ అంత‌టివారే.. ర‌ఘురామ‌కు అంత‌టి ప్రాధాన్యం ఇవ్వ‌డంతో.. ర‌ఘురామ కాషాయ కండువా క‌ప్పుకోవ‌డం ప‌క్కా అంటున్నారు. రఘురామ ఈ సంవత్సరం చివర్లో వైసీపీకి, పార్లమెంట్ సభ్యత్వాని రాజీనామా చేసి, డిసెంబర్ 25న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి రోజున బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఆ తర్వాత నెక్ట్స్‌ ఇయర్ ఫిబ్రవరి మార్చి నెలల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు  జరిగే  ఉపఎన్నికల్లో నర్సాపూర్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారని పార్టీ వర్గాల ద్వారాతెలుస్తోంది. నిజానికి, అమిత్ షా ఏపీ పర్యటనకు ముందే, ఆయన అభిమానులు  ‘ట్రిపుల్  ఆర్’గా పిలుచుకుంటున్న రఘురామ కృష్ణంరాజు, పార్టీ ఎంట్రీకి సంబందించిన స్కెచ్ సిద్దమైందని తెలుస్తోంది. గతంలో చాలా కాలం క్రితమే ఆయన బీజేపీలో చేరేందుకు అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా వద్ద సంసిద్ధతను వ్యక్త పరిచారు. అయితే, అప్పట్లో ఒకరిద్దరు రాష్ట్ర నాయకులు అడ్డుపుల్లలు వేయడంతో ఆ ప్రయత్నం అప్పట్లో ఆగిపోయిందని పార్టీ వర్గాల సమాచారం.  
 
నిజానికి, రఘురామ కృష్ణం రాజు వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగరేసిననాటి నుంచి కమల దళంతో, కాషాయ కూటమి, సంఘ్ పరివార్’తో రాసుకు పూసుకు తిరుగుతున్నారు. బీజేపీ నాయకులనే కాకుండా ఆర్ఎస్ఎస్ అగ్ర నేతలతో అనేక సందర్భాలలతో సమావేశ‌మయ్యారు. అనేక సందర్భాలలో బీజేపీ హిందుత్వ ఎజెండాను తన‌నోటితో వినిపించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం మత వివక్షకు పాల్పడుతోందని విమర్శించారు. తిరుపతి వెంకన్న స్వామి ఆస్తుల విక్రయానికి టీటీడీ చేసిన తీర్మానాన్ని బహిరంగంగా వ్యతిరేకించడంతోనే రెబెల్ ఎంపీ రాజు తిరుగుబాటుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో నిబంధనలకు వ్యతిరేకంగా జరుగతున్న మత ప్రచారం, మత మార్పిడులకు సంబంధించి, ప్రధానికి, రాష్ట్రపతికి ఫిర్యాదులు, విజ్ఞాపనలు అందజేశారు. 
 
అదలా ఉంటే ఇంచుమించుగా ఒక సంవత్సరానికి పైగానే, ఆయన ప్రతి రోజు రచ్చబండలో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తున్నారు. చురకలు అంటిస్తున్నారు. వాతలు పెడుతున్నారు. చివరకు దమ్ముంటే, తన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయించాలని, జగన్ రెడ్డికి సవాల్ విసిరారు. వైసీపీ కూడా, ఆయన్ని అనర్హునిగా ప్రకటించాలని కోరుతూ లోక్ సభ స్పీకర్’కు విజ్ఞప్తి చేసింది. మరో వంక జగన్ రెడ్డి ప్రభుత్వం రఘురామ పై కేసులు పెట్టి అరెస్ట్ చేసింది. జైలుకు పంపింది. బైలు రాకుండా అడ్డుకుంది. అంతే కాదు, జైలులో  చిత్ర హింసలకు గురిచేసిందని ఆయన కోర్టులో కేసు వేశారు.ఇలా జగన్ రెడ్డిపై ఓ వంక రాజకీయ పోరాటం, మరో వంక న్యాయపోరాటం చేస్తున్నారు.మొత్తానికి వార్తల్లో ఎంపీ గా అందరి నోళ్ళలో నలుగుతున్నారు. జగన్ రెడ్డికి పంతికిండి రాయిలా, కంట్లో నలుసులా ఇబ్బంది పెడుతున్నారు. 

ఇక ఇప్పుడు, స్వయంగా అమిత్ షా ఇతర పార్టీల నుంచి వచ్చేవాళ్ళను పార్టీలోకి తెచ్చుకుని వారికి సముచిత స్థానం కలిపించాలని, ఆ విధంగా రాష్ట్రంలో బీజేపీని, 2024 ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా బలోపేతంచేయాలని రాష్ట్ర నాయకులకు క్లాసు తీసుకున్నారు. ఈ నేపధ్యంలో.. అందుకు తొలి అడుగుగా ‘ట్రిపుల్ ఆర్’తో అమిత్ షానే శ్రీకారం చుట్టారని అంటున్నారు. లేటెస్ట్‌గా ప్ర‌ధాని మోదీ సైతం ర‌ఘురామ‌ను గోఅహెడ్ అన్న‌ట్టు భుజం త‌ట్ట‌డం ఆస‌క్తిక‌రం. జ‌గ‌న్‌రెడ్డిపై ర‌ఘురామతో కాషాయ దండ‌యాత్ర త‌ప్ప‌దంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu