‘టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ మోడీ?

 

సింగపూర్‌కి చెందిన ‘ది స్ట్రెయిట్ టైమ్స్’ పత్రిక భారత ప్రధాని నరేంద్రమోడీని ‘ఏషియన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నరేంద్రమోడీ ‘టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పురస్కారం గెలుచుకోవడానికి శనివారం అర్ధరాత్రి ఓటింగ్ ముగిసే సమయానికి మోడీ 16.2 శాతం ఓట్లతో ముందంజలో వున్నారు. ఫెర్గ్యుసన్ నిరసనకారులు 9.2 శాతం ఓట్లతో ఆ తర్వాతి స్థానంలో వున్నారు. సోమవారం నాడు ‘టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఎవరు ఎన్నికయ్యారో అధికారికంగా ప్రకటిస్తారు. 1927 నుంచి టైమ్ మేగజైన్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. ప్రతి ఏడాదీ వార్తలను అత్యంత ప్రభావితం చేసే వ్యక్తికి ఈ పురస్కారం దక్కుతుంది. ‘ఫేస్ ఆఫ్’ పోల్‌లోనూ మోడీ ముదంజలో నిలిచారు. ఆయనకు 69 శాతం ఓట్లు రాగా, ఇండోనేసియా కొత్త అధ్యక్షుడు జోకో విడోడోకు 31 శాతం ఓట్లు దక్కాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటి పదిమంది జాబితాలో స్థానం దక్కించుకోలేకపోచారు. కేవలం 2.2 శాతం ఓట్లతో 11వ స్థానంలో నిలిచారు.