బీహార్ లో పీకే ప్రభావమెంత?.. లాభమెవరికి.. నష్టం ఎవరిది?
posted on Oct 3, 2025 3:12PM

ఒకప్పుడు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే.. ఇప్పుడు తన పార్టీకి తాను ఎన్నికల వ్యూహాలు రచించుకుంటున్నారు. ఔను ఒక్కప్పుడు ఏ రాష్ట్రంలోనైనా ఫలానా పార్టీ అధికారంలోకి రావాలంటే.. ఆ పార్టీకి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల స్ట్రాటజిస్ట్ అయ్యి ఉండాలి అని అంతా భావించారు. 2014 ఎన్నికలలో కేంద్రంలో మోడీ నాయకత్వంలో ప్రభుత్వం కొలువుదీరడానికైనా, 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారన్నా.. అలాగే పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి వరుసగా మూడో సారి అధికార పగ్గాలను అందుకున్నారన్నా.. అందుకు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలే కారణమన్నది పరిశీలకులు విశ్లేషణ.
అలాంటి ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు సొంతంగా జన సురాజ్ పేరుతో ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని త్వరలో బీహార్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో ఓంటరిగా రంగంలోకి దిగుతున్నారు. ప్రశాంత్ కిశోర్ స్వరాష్ట్రం బీహార్ అయినప్పటికీ ఈ సారి ఆయన ఎన్నికల వ్యూహాలు ఫలించే అవకాశాలు అంతంత మాత్రమేనన్నది పరిశీలకుల విశ్లేషణ. మూడేళ్ల కిందట సరిగ్గా ఇదే నెలలో ఆయన జగన్ సూరజ్ పార్టీ అధినేతగా బీహార్ లో పాదయాత్ర ఆరంభించారు. అప్పటి నుంచీ రాష్ట్రమంతటా తిరుగుతూనే ఉణ్నారు. ఇప్పటి వరకూ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 5500 గ్రామాలను పాదయాత్ర ద్వారా చుట్టేశారు. భారీ ర్యాలీలు, బహిరంగ సభల వంటివి లేకుండానే.. తన పాదయాత్రలో భాగంగా ఇల్లిల్లూ తిరుగుతున్నారు. భారీ ర్యాలీలూ, ప్రసంగాలకు దూరంగా. ఆయన ప్రజలలో మమేకమై వారి సమస్యల పరిష్కారం విషయంలో గట్టిగా నిలబడతానని హామీ ఇస్తున్నారు.
ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ పట్ల యువత ఆకర్షితులౌతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే బీఆర్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా ప్రజా హృదయాలను గెలుచుకున్నారంటున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు, ఓటమి అన్న అంశాల జోలికి పోకుండా జనసురాజ్ పార్టీ అన్ని నియోజకవర్గాలలోనూ పార్టీ వాయిస్ ను వినిపించాలన్న లక్ష్యంతో ప్రశాంత్ కిశోర్ ముందుకు సాగుతున్నారు. విశ్వసీయ సమాచారం మేరకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. బీఆర్ లో ప్రధాన పోరు ఎన్డీయే, ఇండియా కూటముల మధ్యే ఉందని సర్వేలు చెబుతున్నాయి. అంతే కాకుండా స్వల్ప మొగ్గు ఇండి కూటమి (బీహార్ లో మహాఘట్ కూటమి) వైపే ఉందని సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి. బీహార్ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ జనసూరజ్ పార్టీ కీలక పాత్ర పోషించనుందని ఆ సర్వేలు చెబుతున్నాయి.
పార్టీ ఏర్పాటు చేసిన తరువాత తొలి సారి ఎన్పికల రణరంగంలోకి అడుగుపెట్టిన శాంత్ కిషోర్ తన పార్టీ అభ్యర్థులను అన్ని నియోజకవర్గాలలోనూ నిలబెట్టనున్నారు. సర్వేల అంచనా ప్రకారం ప్రశాంత్ కిషోర్ జన సూరజ్ పార్టీ 8 నుంచి 11 శాతం ఓట్లు సాధించే అవకాశాలున్నాయి. అయితే సీట్ల పరంగా మాత్రం ప్రశాంత్ కిషోర్ జీరో నంబర్ తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుందంటున్నారు. ఇక రాష్ట్రంలో నితీష్ కుమార్ ప్రభుత్వం తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని సర్వేలు పేర్కొన్నాయి. ప్రశాంత్ కిశోర్ పార్టీ ఎనిమిది నుంచి 11 శాతం ఓట్లు సాధించడమంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును భారీగా చీల్చడమే అవుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆ సంగతి అటుంచితే..ప్రకాంత్ కిషోర్ కొత్త పార్టీతో తొలి సారి ఎన్నికల రణరంగంలోకి దిగి ఆ మాత్రం ఓట్ షేర్ సాధించడంటే మాటలు కాదని అంటున్నారు.