జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి.. ఎవరో తెలుసా?
posted on Oct 3, 2025 3:27PM
.webp)
నిర్మాతగా మారిన పారిశ్రామిక వేత్త రామ్ తాళ్లూరి ఇప్పుడు రాజకీయ నాయకుడయ్యారు. ఔను జనసేన అధినేత రామ్ తాళ్లూరికి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. పలు ఐటీ కంపెనీలు ఉన్న వ్యాపార వేత్త అయిన రామ్ తాళ్లూరి.. అటు తరువాత సినిమా నిర్మాతగా కూడా మారారు. డిస్కో రాజా, నేల టికెట్, చుట్టాలబ్బాయి, మట్కా మరియు మెకానిక్ రాకీ వంటి చిత్రాలను నిర్మించినా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు.
అది పక్కన పెడితే.. రామ్ తాళ్లూరి ఛారిటీ కార్యక్రమాలు పవన్ కల్యాణ్ దృష్టిని ఆకర్షించాయి. జనసేన ఆవిర్బావం నుంచీ కూడా రామ్ తాళ్లూరి జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలిచారు. గత కొన్నేళ్ల నుంచీ జనసేన సోషల్ మీడియా వింగ్ వ్యవహారాలలో చురుకుగా పాల్గొంటున్నారు. అలాగే తెలంగాణలో కూడా జనసేన కోసం రామ్ తాళ్లూరి పని చేస్తున్నారు. జనసేన, జనసేనాని పవన్ కల్యాణ్ కు అభిమాని అయినా ఇప్పటి వరకూ రామ్ తాళ్లూరి పవన్ కల్యాణ్ తో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా నిర్మించలేదు.
అయినా జనసేన పట్ల అంకిత భావంతో గత పదేళ్లుగా పని చేస్తున్న రామ్ తాళ్లూరిని పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి వరించింది. ముందు ముందు ఆయనకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్న పవన్ కల్యాణ్ కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవిని రామ్ తాళ్లూరికి కేటాయించడం ఆయన నిబద్ధతపై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా జనసైనికులు అభివర్ణిస్తున్నారు.