కాంగ్రెస్ కు పీకే హ్యాండ్- పార్టీలో చేరరు.. కేవలం సలహాదారే!

ఎన్నికల వ్యూహకర్త కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో వరుస భేటీలతో ఇక తన చేరిక లాంఛనమే అన్న ఇంప్రషన్ కలిగించిన పీకే చివరకు కాంగ్రెస్ లో చేరకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణదీప్ సూర్జెవాల ధృవీకరించారు. అయితే కాంగ్రెస్ పార్టీకి పీకే సలహాదారుగా కొనసాగుతారని చెప్పారు. పీకే నిర్ణయాన్ని గౌవరిస్తామనీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా ఆ పార్టీతో కలిసి పని చేయడానికి పీకే ముందుకు వచ్చిన సంగతి విదితమే. 
అ క్రమంలోనే పీకే పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ సహా పలువురు నేతలతో వరుస భేటీలు జరిపారు. చివరకు ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని దాదాపుగా అంతా భావించారు. అయితే టీ. కాంగ్రెస్ మాత్రం మొదటి నుంచీ పీకే కాంగ్రెస్ లో చేరుతారన్న వార్తలను ఖండిస్తూనే వచ్చింది. 
ఆయన నీడ కూడా కాంగ్రెస్ మీద పడదని టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పత్రికాముఖంగానే తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ తరఫున పని చేస్తూ కాంగ్రెస్ లో కొనసాగడానికి తమ పార్టీ నిబంధనలు అంగీకరించవనీ, అధినేత్రి అస్సలు ఒప్పుకోరనీ ఆయన చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన విధంగానే చివరికి పీకే కాంగ్రెస్ లో చేరడం లేదని  తేలిపోయింది. 

ఇలా ఉండగా పీకేతో చర్చల అనంతరం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సాధికార కార్యాచరణ గ్రూప్ -2024 (ఈఏజీ)ను ఏర్పాటు చేశారనీ, ఆ గ్రూప్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా పీకేను ఆహ్వానిచారనీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జెవాల ట్విట్టర్ ద్వారా తెలిపారు. పీకే నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందని పేర్కొన్నారు.

కాగా తాను కాంగ్రెస్ లో చేరబోవడం లేదని పీకే కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి తనను ఈఏజీలో భాగంగా పార్టీలో చేరాలంటూ ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తున్నానన్న పీకే, అయితే ఇప్పుడు కాంగ్రెస్ కు కావలసింది తాను కాదనీ, పార్టీ సంస్థాగత నిర్మాణ సమస్యలను  పరిష్కరించగల సమర్ధ నాయకత్వమనీ పేర్కొన్నారు. అందుకే తాను సోనియా గాంధీ ఆహ్వానాన్ని తిరస్కరించాననీ పేర్కొన్నారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu