చంద్రబాబుతో పిఠాపురం వర్మ భేటీ.. నామినేటెడ్ పోస్టు ఖాయమేనా?

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రికార్డు మెజారిటీతో విజయం సాధించడం వెనుక ఆ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ ఎస్పీఎస్ఎన్ వర్మ త్యాగం, కృషి, పట్టుదల ఉన్నాయనడంలో ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు. పైగా పిఠాపురంలో తన విజయానికి సర్వశక్తులూ ఒడ్డి శ్రమించిన వర్మను విజయం తరువాత స్వయంగా పవన్ కల్యాణ్ ప్రశంసించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా వర్మ త్యాగాన్ని, కృషిని గుర్తించారు. సరైన న్యాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారు. 

నిజమే గత ఎన్నికల సమయంలో పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించినప్పుడు, ఆ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశించి గత ఐదేళ్లుగా నియోజకవర్గంలోనే పని చేస్తూ వస్తున్న వర్మ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆయన అభిమానులైతే రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేశారు. సరిగ్గా ఆ సమయంలో చంద్రబాబు జోక్యం చేసుకుని వర్మను ఉండవల్లి పిలిపించుకుని మాట్లాడారు. కూటమి అవసరాలు వివరించారు. సమన్వయంతో పని చేసి పవన్ కల్యాణ్ విజయానికి దోహదపడమని ఆదేశించారు.

దీంతో క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం కార్యకర్తలా వర్మ ఆ క్షణం నుంచీ పవన్ కల్యాణ్ విజయమే లక్ష్యంగా పని చేశారు. దీంతో పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించారు. దీంతో ఇటు చంద్రబాబు, అటు పవన్ కల్యాణ్ కూడా వర్మను ప్రశంసలతో ముంచెత్తారు. పవన్ కల్యాణ్ అయితే వర్మకు అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ క్రమంగా పరిస్థితిలో మార్పు వచ్చింది.  జనసేన మద్దతు దారులతో వర్మకు గ్యాప్ ఏర్పడింది. తన నాయకుడి ఘన విజయం క్రెడిట్ లో కొంతైనా వర్మకు ఇచ్చుందుకు ఇష్టం లేకపోవడమో మరో కారణమో తెలియదు కానీ నియోజకవర్గంలో వర్మను క్రమంగా దూరం పెట్టడం మొదలైంది. అంతే కాకుండా నియోజకవర్గంలో ఆయన వ్యతిరేకులైన వైసీపీ వారిని జనసేనలో చేర్చుకున్నారు. ఇది సహజంగానే వర్మకు ఒకింత ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో వర్మ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. 

గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో చంద్రబాబు వర్మకు ప్రధాన్యమున్న పోస్టులోకి తీసుకుం టానని హామీ ఇచ్చినట్లు చెబుతారు. ఇప్పుడు చంద్రబాబుతో వర్మ భేటీ ఈ నేపథ్యంలోనే ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీకి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అటువంటి తరుణంలో వర్మ చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.