ఉపఎన్నికల వాయిదాకు హైకోర్టులో పిల్
posted on May 1, 2012 10:34AM
రాష్ట్రంలో తరచుగా వస్తున్నా ఉపఎన్నికలపై అనంతపురానికి చెందిన న్యాయవాది నారాయణస్వామి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. రాష్ట్రంలో 2009నుంచి ఇప్పటి వరకూ నాలుగుసార్లు ఉపఎన్నికలు జరిగాయని, ఫలితంగా సుమారు వందకోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయిందని ఆయన తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఉపఎన్నికల కారణంగా మరో 50 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిథులు తరచూ రాజీనామాలు చేయటం, వాటిని స్పీకర్ ఆమోదించటం, మళ్ళీ ఎన్నికలు నిర్వహించటం వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియ అపహాస్యంగా మారిందన్నారు. ఎన్నికల కోడ్ అమలు జరగటంతో ఎన్నికలు జరిగే ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయన్నారు. వేసవిలో తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ ఇబ్బందులను గుర్తించి ఉపఎన్నికలు వాయిదావేయాలని నారాయణస్వామి తన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో హైకోర్టును కోరారు.