ఫోన్ ట్యాపింగ్ కేసులో పురోగతి
posted on Jul 23, 2015 2:41PM
.jpg)
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు ఉన్నతాధికారుల ఫోన్లను తెలంగాణా ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ అధికారులు, ట్యాప్ చేయబడినట్లు అనుమానిస్తున్న కొన్నిఫోన్ల కాల్ డాటాను మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ల నుండి తమకు ఇప్పించవలసిందిగా కోరుతూ కొన్ని రోజుల క్రితం విజయవాడ కోర్టులో ఒక మెమో దాఖలు చేసారు. కానీ ఆ వివరాలు ఎవరికయినా ఇస్తే తమను ప్రాసిక్యూట్ చేస్తామని తెలంగాణా ప్రభుత్వం హెచ్చరించిందని వారు కోర్టుకి తెలియజేసారు. కానీ ఈ నెల 24వ తేదీలోగా ఆ వివరాలను తమకు ఇవ్వకపోతే కోర్టు ధిక్కారనేరం క్రింద వారిపై చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించడంతో వారి పని మున్ధునుయ్యిఒ వెనుక గొయ్యి అన్నట్లుగా తయారయింది. దానితో వారు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.
వారి పిటిషన్ని ఇవాళ్ళ విచారణకు చేప్పట్టిన సుప్రీంకోర్టు, ఆ కాల్ డాటాని ఒక సీల్డ్ కవర్లో ఉంచి వారం రోజుల్లోగా విజయవాడ కోర్టుకి సమర్పించామని ఆదేశించింది. కానీ దానిని మూడు వారాల తరువాత మాత్రమే తెరిచి చూడాలని, నాలుగు వారాల తరువాత మాత్రమే దానిపై దర్యాప్తు చేయడానికి అనుమతించమని విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుని ఆదేశించింది. ఇంతవరకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు చేస్తోంది. కానీ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు కాల్ డాటా ఇవ్వకపోవడంతో ఆధారాలు బయటపెట్టలేకపోతోంది. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా అనుమతించింది కనుక ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారుల చేతికి చిక్కే అవకాశం ఉంది. ఇంతవరకు ఓటుకి నోటు కేసులో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అనైతిక చర్యలకి పాల్పడిందని వాదిస్తున్న తెలంగాణా ప్రభుత్వానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రమేయం ఉన్నట్లు తేలితే అంతకంటే అవమానకరమయిన పరిస్థితులు ఎదుర్కోకతప్పదు.