నిద్ర లేవగానే ఫోన్ చూసే అలవాటుందా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

 

ఇప్పట్లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటోంది.  ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఒక్కొక్క ఫోన్ ఉంటుంది.  చాలా వరకు ఫోన్ ఎక్కడికి వెళ్లినా వెంట ఉంటుంది. ఇక చాలామందికి  ఉదయాన్నే ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. ఇదేమంత చెడ్డ అలవాటు కాదు కదా అనుకుంటారు కొందరు. ఉదయం లేవగానే వాట్సాప్ మెసేజ్లు, ఇమెయిల్స్.. వంటివి కొందరు చూస్తే.. ఉదయాన్నే యూట్యూబ్ ఓపెన్ చేయడం మరికొందరి అలవాటు.   ఇంకొందరు ఉదయాన్నే అలా బ్రౌజింగ్ చేస్తుంటారు.  ఇది చాలా చెడ్డ అలవాటు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు ఉదయాన్నే ఫోన్ చూడటం  వల్ల కలిగే నష్టమేంటి? తెలుసుకుంటే..

ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూసే  అలవాటు  మెదడుకు సరైనది కాదని అంటున్నారు వైద్యులు.  నిద్రలేవగానే వెంటనే ఫోన్ చెక్ చేయడం వల్ల మనసుకు విశ్రాంతి లభించదు. ఉదయం నిద్రలేచిన తర్వాత  నిదానంగా రోజును ప్రారంభించాలి. అకస్మాత్తుగా ఫోన్ వాడటం,  సందేశాల ప్రవాహం మనస్సును అలసిపోయేలా చేస్తుంది.  ఆలోచించే,  అర్థం చేసుకునే మీ సామర్థ్యాన్ని తగ్గిస్తుందట.

ఒత్తిడి..

పొద్దున్నే లేవగానే చాలా రకాల నోటిఫికేషన్లు వస్తుంటాయి. వీటిలో కొన్ని ఉపయోగకరమైన సందేశాలు, సోషల్ మీడియా లో కొత్త విషయాలు లేదా వార్తలు ఇలా ఏవైనా ఉండవచ్చు. ఇవన్నీ కలిసి  మనస్సులో ఒత్తిడిని కలిగిస్తాయి. ఉదయాన్నే ఈ ఒత్తిడి కారణంగా మనసు కలత చెందుతుందట. కాబట్టి ఉదయం నిద్రలేవగానే ఫోన్ వాడకుండా ఉండటం చాలా ముఖ్యం.

కంటి ఆరోగ్యం..

ఉదయాన్నే కళ్ళు  రిలాక్స్డ్ స్థితిలో ఉంటాయి.రాత్రంతా విశ్రాంతి తీసుకోవడం వల్ల కళ్లు ప్రశాంతంగా ఉంటాయి. అయితే కళ్లు విశ్రాంతిగా ఉన్నప్పుడు బయటి వాతావరణానికి, బయటి వెలుగుకు కూడా కళ్లు అలవాటు పడకముందే    ఫోన్ స్క్రీన్ చూడటం వల్ల మీ కళ్ళలో నొప్పి లేదా పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. ఇది తలనొప్పికి కూడా కారణమవుతుంది.  కళ్ళ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

వ్యసనం..

నిద్ర లేచిన  వెంటనే పదేపదే ఫోన్ చూసే అలవాటు ఒక రకమైన వ్యసనంగా మారుతుంది. నోటిఫికేషన్లు చూసే వరకు మనసు, మెదడు ఆరాటపడుతూనే ఉంటాయి.  వీటిని శాంతపరచడం కోసం ఫోన్ ను పదే పదే చూడటం జరుగుతుంది.  ఇది కాస్తా  పదేపదే  ఫోన్ చూసేలా మెదడును, మనసును ప్రేరేపిస్తుంది.   ఇది వ్యసనానికి దారి తీయడం ద్వారా దృష్టి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

నోటిఫికేషన్ల మాయ..

ఫోన్ లో నిరంతరం వచ్చే నోటిఫికేషన్ల వల్ల ఏ పని మీద ఏకాగ్రత నిలవదు. దీని వల్ల పదే పదే దృష్టి ఫోన్ వైపే వెళుతుంది. ఈ కారణంగా ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టలేరు. రోజు ప్రారంభం నుండి రోజు ముగిసేవరకు ప్రతి పని సంతృప్తిగా చేయలేరు.

నిద్ర చక్రంపై చెడు ప్రభావం

స్లీపింగ్ సైకిల్..


నిద్రపోయే ముందు, తర్వాత ఫోన్ చూస్తే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. నిద్రపోయే ముందు,  తర్వాత  మేల్కొన్న వెంటనే ఫోన్ చూస్తే నిద్ర చక్రం పాడవతుంది.  స్క్రీన్ నుండి వెలువడే నీలి కాంతి మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఇది  నిద్రపోవడం కష్టతరం చేస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లేకపోవడం,  అలసట వంటి సమస్యలు వస్తాయి.

                             *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News