భారతీయ విలేఖరి ప్రశ్నలతో ముషార్రఫ్‌కు అస్వస్థత

నిన్న పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌తో, ఇండియా టుడే విలేఖరి రాహుల్‌ కన్వల్‌ జరిపిన ఇంటర్వూలో అనేక సంచలనాత్మక విషయాలు వెల్లడైన విషయం తెలిసిందే! ఈ సందర్భంగా తీవ్రవాదానికి పాకిస్తాన్‌ ప్రోత్సాహం గురించి రాహుల్‌ కన్వల్‌ తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేశారు. పాకిస్తాన్‌ గూఢచర్య సంస్థ ISI తీవ్రవాద సంస్థలకు శిక్షణ ఇస్తోందన్న విషయాన్ని ముషార్రఫ్‌ తన జవాబులలో ఒప్పుకోక తప్పలేదు. ఇంతేకాదు! ముషార్రఫ్ మనసులో ఉన్న అనేక ద్వంద్వ విషయాలను రాహుల్‌ నేర్పుగా ప్రేక్షకుల ముందు ఉంచగలిగారు. సూటిగా వస్తున్న ప్రశ్నల నుంచి తప్పించుకునే దశలో ముషార్రఫ్‌ చాలా ఆగ్రహానికి లోనైనట్లు ఇంటర్వూలోనే కనిపించింది. భారతదేశం మీద దాడి చేసేవారు హీరోలనీ, పాకిస్తాన్‌ మీద దాడి చేసేవారు విలన్లనీ... ముషార్రఫ్‌ పొంతన పొసగని సమాధానాలు చెప్పారు. ఇంటర్వూ ముగిసే సమయానికి ప్రేక్షకులకి ముషార్రఫ్‌ ద్వారా, పాకిస్తాన్‌ పాలకుల ఆలోచనాతీరు ఎలా ఉందో తెలిసిపోయింది. దీంతో ముషార్రఫ్ తీవ్ర ఆందోళన చెందినట్లు తెలుస్తోంది. ఇంటర్వూ ముగియడంతోనే ఆయన రక్తపోటు పెరిగిపోయి, ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.