వేదాలకు లేని బాధ మీకెందుకు- సుప్రీంకోర్టు సూటి ప్రశ్న

శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశించే విషయమై సుప్రీంకోర్టు ఇవాళ తీవ్రమైన వ్యాఖ్యలను చేసింది. వేదాలలో కానీ ఉపనిషత్తులలో కానీ స్త్రీ, పురుషుల మధ్య వివక్షను చూపలేదనీ... అలాంటిది మీరు స్త్రీలు ఆలయంలోకి ప్రవేశించేందుకు ఎందుకు అడ్డుపడుతున్నరంటూ ఆలయం తరఫున న్యాయవాదిని ప్రశ్నించింది. ధర్మాసనం వేసిన ప్రశ్నలకు స్పందిస్తూ శబరిమల ఆలయ బోర్డు తరఫున న్యాయవాది వేణుగోపాల్‌ ‘శబరిమలలో ఆడవారిని అనుమతించకపోవడం అనే ఆచారం దాదాపు వేయి సంవత్సరాల నుంచే ఉందనీ, ఇప్పడు అనవసరంగా దానిని మార్చవలసిన పనిలేదనీ’ వాదించారు. వేణుగోపాల్‌ వాదనలకు స్పందించిన న్యాయమూర్తులు... శబరిమలలో కొనసాగుతున్న ఆచారానికి సంబంధించిన చారిత్రాత్మక ఆధారాలనీ, ఆ ఆచారాన్ని మొదలుపెట్టేందుకు గల సహేతుకమైన కారణాలనీ ఆరువారాలలోగా కోర్టుకి సమర్పించమని కోరారు. శబరిమల ఆలయం తమకు సమర్పించే ఆధారాలని పరిశీలించిన తరువాత, అవి రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది పరిశీలించి తమ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తామని న్యాయమూర్తులు తెలియచేశారు. తాము మతపరమైన సున్నిత అంశాల జోలికి పోమనీ, అయితే మరో వైపు రాజ్యాంగం కల్పించిన సమానహక్కులను కాపాడే బాధ్యతని కూడా విస్మరించమనీ కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కోర్టు వ్యాఖ్యల బట్టి చూస్తే, శబరిమల ఆలయంలో స్త్రీల ప్రవేశానికి కోర్టు సానుకూలంగానే తీర్పుని వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.