రాజమండ్రి టు ఉండవల్లి.. 14 గంటల ప్రయాణం.. అడుగడుగునా జన నిరాజనం

నారా చంద్రబాబునాయుడు.. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ  రాజకీయ జీవితంలో చంద్రబాబు ప్రజలకు దూరంగా ఎన్నడూ లేరు. అనారోగ్యం, కుటుంబ కార్యక్రమాలు  అంటూ ప్రజలకు కనిపించకుండా ఉన్న రోజులు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అలా లెక్క పెట్టినా కొన్ని వేళ్లు మిగిలిపోతాయి. అంటే కనీసం పది రోజులు కూడా ఆయన ప్రజలకు కనిపించకుండా.. మీడియాతో మాట్లాడకుండా ఎన్నడూ లేరు. అయితే స్కిల్ కేసులో ఆయనను జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసి  52 రోజుల పాటు ఆయనను ప్రజలకు దూరం చేయగలిగింది. అయితే ఆయన ప్రజలకు కనిపించలేదు కానీ ప్రజా హృదయాలలో ఆయన ఉన్నారన్న విషయం ఈ 52 రోజులలో సందేహాలకు అతీతంగా తేటతెల్లమైంది.

ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు.. సాటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఉన్న ప్రతి చోటా ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళనలు జోరుగా సాగాయి. దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికీ లేని విధంగా రాజకీయాలకు అతీలంగా, ప్రాంతాలకు సంబంధం లేకుండా ఆయనకు అభిమానులు ఉన్నారన్న విషయం తేటతెల్లమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధిలోనే కాదు.. దేశ ప్రగతిలో కూడా ఆయన అడుగు జాడ చరిత్రలో నిలిచిపోయే విధంగా ముద్రపడిందన్న సంగతి వెల్లడైంది. పాతికేళ్ల కిందట హైటెక్ సిటీతో మొదలైన ఆయన ప్రగతి ప్రస్థానం గురించి గతంలో తెలియని వారికి కూడా తెలిసింది. ఆయన నాటిన ఐటీ విత్తనం..నాడు కంప్యూటర్లు కూడు పెడతాయా అని వెక్కిరించిన వారిచేతే నేడు ఆయన దార్శనికతకు తలవంచి వందనం  చేసే విధంగా మహా వట వృక్షమైంది. ఎందరికో నిడనిస్తోంది. లక్షల మంది జీవితాలలో స్థిరపడేలా చేసింది. ఐటీ అలంబనగా.. అన్ని  రంగాలూ పురోగమించేందుకు కారణమైంది. వెరసి హైదరాబాద్ విశ్వ నగరంగా ఎదగడానికి చంద్రబాబు నాటిన ఐటీ విత్తే పునాదిగా మారింది. 

అటువంటి చంద్రబాబును జగన్ సర్కార్ స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టు చేసింది. ఆధారాలు లేకుండా అరెస్టు చేయడమే కాకుండా.. ఎటూ అరెస్టు చేసేశాం కదా.. ఇప్పుడు ఆధారాల కోసం వెతుకుతాం.. అంత వరకూ జైల్లోనే ఉంచుతాం అంటూ.. కోర్టులలో వాదించింది. పెట్టిన సెక్షన్లు, కోరిన వాయిదాలతో జగన్ సర్కార్  చంద్రబాబును 52 రోజులు నిర్బంధంలో ఉంచింది. అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేం  అన్నట్లుగానే అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులతో ఒక మహానేతను ప్రజలకు దూరం చేయడం సాధ్యం కాదని.. ఆయన అరెస్టుకు  నిరసనగా వెల్లువెత్తిన ప్రజా చైతన్యం నిర్ద్వంద్వంగా రుజువు చేసింది. చంద్రబాబు అక్రమ అరెస్టు లగాయతు..  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని ఒక  జైలుగా మార్చేసిన విధంగా జగన్ సర్కార్ రాష్ట్రంలో ఆంక్షలను అమలు చేసింది. చంద్రబాబు అరెస్టును  నిరసిస్తూ విజిల్ వేస్తే.. నేరం, డప్పు కొడితే నేరం, నిరసన తెలిపితే  నేరం అన్నట్లుగా ఎక్కడికక్కడ ఆంక్ష లు విధించింది. రోడ్లపైకి వచ్చిన వారిని అరెస్టు చేసింది. అయినా నిర్బంధాలను లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో జనం  రోడ్లపైకి వచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా  నిలబడ్డారు. 

చివరికి  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం  (అక్టోబర్ 31) మధ్యంతర బెయిలు మంజూరైంది. అదే రోజు సాయంత్రం ఆయన రాజమహేంద్రవరం జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయన బయటకు వచ్చిన క్షణం నుంచీ ఏపీలో దిపావళి  సంబరాలు మొదలయ్యాయి. రోడ్డు  మార్గంలో ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ఉండవల్లిలోని నివాసానికి బయలుదేరారు. అప్పటి నుంచీ 14 గంటల పాటు ఆయన ప్రయాణం జన నిరాజనాల మధ్య, అభిమాన పూల వానలో సాగింది. రోడ్డు కిరువైపులా పెద్ద సంఖ్యలో జనం నిలబడి ఆయనను ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా పూలవాన కురిపించారు. ఈ ప్రయాణంలో ఆయన కారులోంచి బయటకు వచ్చింది లేదు. కారులో కూర్చునే ప్రజలకు అభివాదం చేశారు. బుధవారం (నవంబర్1) వరకూ ర్యాలీలు నిర్వహించవద్దన్న కోర్టు ఆదేశాలకు కట్టుబడి  ఆయన కారులోంచి బయటకు రాలేదు. కానీ జనం మాత్రం ఆయనకు స్వాగతం పలకడానికీ, సంఘీభావం తెలపడానికీ రోడ్డుకిరువైపులా నిలబడి జేజేధ్వనాలు పలుకుతూనే ఉన్నారు. రాజమహేంద్రవరం  నుంచి ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి సరిహద్దులు దాటడానికే నాలుగు గంటలకు పైగా సమయం పట్టిందంటే జనం ఆయనకు ఏ విధంగా నీరాజనాలు పలికారో అర్ధం చేసుకోవచ్చు.

ఒక్క తూర్పుగోదావరి అని ఏమిటి ఉండివల్లిలోని ఆయన నివాసం వద్దకు చేరుకునే వరకూ అర్ధరాత్రి దాటిన తరువాత కూడా రోడ్లపై జనం జాతర కనిపించింది. పెద్ద సంఖ్యలో మహిళలు ఆయన కోసం వేచి చూడటం కనిపించింది. కాగా జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు మానసికంగా చాలా ధృఢంగా కనిపించారు. అనారోగ్యంతో ఒకింత నీరసంగా  కనిపించినా అది ఎక్కడా బయటపడనీయకుండా ఆయన ప్రజలకు అభివాదం చేశారు. పార్టీ నాయకులను పేరుపేరునా పలకరించారు. తప్పు చేయను, చేయనివ్వను అంటూ ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu