కంటతడి పెట్టిన కేశవ్
posted on Nov 20, 2012 1:59PM

జగన్ పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్ లపై టిడిపి నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పయ్యావుల చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండిస్తూనే...మీడియాతో మాట్లాడుతూ ఆయన కంటతడి పెట్టారు. టిడిపిని వీడే ప్రసక్తే లేదని పయ్యావుల కేశవ్ చెప్పారు. సంపాదనపై ఆశ లేకుండా రాజకీయాలో కొనసాగుతున్నానని, తాను జీవితంలో బాధ పడిన రోజుల్లో ఇది ఒకటని అన్నారు.
ఉరవకొండ నియోజకవర్గంలో కంటిన్యూగా మూడు సార్లు గెలిచిన చరిత్ర తనదని అన్నారు. జగన్ పార్టీ బలమైన నేతలను టార్గెట్ చేసుకొని మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీలోకి నేను వస్తానని వాళ్ళవద్దకు వెళ్లానా, లేక వాళ్ళు నావద్దకు వచ్చారా అన్న విషయం కూడా చెప్పాలని కేశవ్ డిమాండ్ చేశారు. ఉపఎన్నికల్లో ఆ పార్టీ గెలిచినంత మాత్రాన అటు వైపు వెళ్ళే బలహీనత తనదికాదన్నారు.
జగన్ తండ్రితోనే పోరాటం చేసిన తాను ఇప్పుడు జగన్ పైన చేస్తానన్నారు.. వ్యూహంలో భాగంగా తనపై అసత్యాలు ప్రచారం చేసి గౌరవాన్ని, ఇమెజ్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి అసత్య ప్రచారం వల్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తాత్కాలికంగా లబ్ధి పొందవచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం టిడిపికే లాభం అన్నారు. సంక్షోభం తలెత్తిన పలు సందర్భాలలో టిడిపి ఉవ్వెత్తున ఎగిసిందన్నారు.